ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లను వైసీపీ అధిష్టానం అమ్ముకుంటోందని వైసీపీ రెబల్ నేత రఘురామ సంచలన ఆరోపణలు చేశారు. డబ్బులు తీసుకునే ఎంతోమందికి వైసీపీ హై కమాండ్ టికెట్లు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ఆ రకంగా టికెట్ కోసం డబ్బులిచ్చి మోసపోయిన వైసీపీ నేతలు రాజేశ్ నాయుడిని స్ఫూర్తిగా తీసుకోవాలని హితవు పలికారు. రాజేశ్ నాయుడులా ధైర్యంగా మీడియా ముందుకొచ్చి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.
మంత్రి విడదల రజనీకి గుంటూరు ట్రాన్స్ ఫర్ అయిందని, ఆ తర్వాత చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జ్ గా రాజేశ్ నాయుడుని నియమించారని గుర్తు చేశారు. టికెట్ కోసం ఆరున్నర కోట్లు తన దగ్గర వసూలు చేశారని రాజేశ్ చెప్పిన విషయాన్ని రఘురామ నొక్కి వక్కాణించారు. పెద్ద మనసు చేసుకున్న సజ్జల 3 కోట్లు వెనక్కిచ్చేశారట…మరి, మిగిలిన మూడున్నర కోట్లు పెద్దాయన ఖాతాకు చేరి ఉంటాయి..అంటూ రఘరామ షాకింగ్ ఆరోపణలు చేశారు.
డబ్బులిచ్చినా టికెట్ దక్కని వారు రాజేశ్ నాయుడిలా మీడియా ముందుకొస్తే సగం డబ్బులైన రికవర్ అవుతాయని సెటైర్లు వేశారు. నరసాపురం నుంచి తాను పోటీ చేయకుండా అడ్డుకునేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో తాను నరసాపురం నుంచే పోటీ చేస్తానని చెప్పారు.