వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. తనపై అనర్హత వేటు వేయించాలంటూ జగన్ ను ఛాలెంజ్ చేసిన రఘురామ…జగన్ అలా చేస్తే రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు. ఆ ఛాలెంజ్ చేసినా సరే ఇప్పటివరకు రఘురామపై అనర్హత వేటు వేయించడంలో వైసీపీ అధినేత జగన్ విశ్వప్రయత్నాలు చేసి విఫలమయ్యారన్న టాక్ ఉంది.
దీంతో, ఆర్ఆర్ఆర్ ఏపీలో అడుగుపెడితే ఇబ్బందులు పెట్టడానికి, ఇరకాటంలో పడేయడానికి వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్న టాక్ ఉంది. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై తాజాగా రఘురామ స్పందించారు. తాను ఏపీకి రావడానికి వీల్లేదని సీఎం జగన్ అన్నట్లు తన దృష్టికి వచ్చిందని రఘురామ అన్నారు. తన నియోజకవర్గంలో తాను పర్యటించడానికి జగన్‌కి వచ్చిన ఇబ్బందేంటని ఆయన ప్రశ్నించారు.
ఈ విషయం తనకు కొందరు ఎంపీలు చెప్పారని, రాష్ట్రం ఏమైనా జగన్ సొంతమా? అని రఘురామ నిలదీశారు. జగన్ చెప్పినట్లు పోలీసులు ఆడుతున్నారని మండిపడ్డారు. లా జస్టిస్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ కమిటీ’ విశాఖలో సమావేశం కావాల్సి ఉందని, అయితే, ఆ కమిటీలో రఘురామ ఉంటే సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని డీజీపీ సూచించినట్లు తనకు తెలిసిందని షాకింగ్ కామెంట్లు చేశారు. విశాఖకు రఘురామ వస్తే అరెస్ట్ చేస్తామని, ఆ తర్వాత కమిటీ సభ్యులు ఇబ్బందిపడతారని డీజీపీ వార్నింగ్ ఇచ్చారని ఆయన ఆరోపించారు.
ఒక ఎంపీ ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనను అడ్డుకోవడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు దెబ్బతీసే బరితెగింపు చర్యలకు జగన్ దిగుతున్నారని ఫైర్ అయ్యారు .అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని, తన గ్రామంలో తన ఇంటి సమీపంలో అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారని, ఈ అరుదైన సందర్భంలో స్థానిక ఎంపీగా ఆ కార్యక్రమానికి తాను హాజరుకావడం ప్రోటోకాల్ అని గుర్తు చేశారు.
ప్రధాని కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరైనా కాకపోయినా ప్రోటోకాల్ ప్రకారం తాను మాత్రం హాజరు కావాలని చెప్పారు. 32 కేసుల్లో నిందితుడిగా ఉన్న సీఎం జగన్ విదేశాలకు వెళ్లొచ్చు గానీ… తాను మాత్రం సొంత నియోజకవర్గానికి వెళ్లకూడదా? అని ప్రశ్నించారు.