ఏపీ సీఎం జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రతి రోజు బాణం లాంటి లేఖను సంధిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ లేఖలో రఘురామ తూటాల్లాంటి మాటలతో జగన్ ను ఇరుకున పడేస్తున్నా కూడా వైసీపీ నేతలు నోరు మెదపలేని స్థితిలో ఉన్నారన్న టాక్ వస్తోంది. జగన్ ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదంటూ రఘురామ రాస్తున్న లేఖలు…జగన్ ను ఇరకాటంలో పడేస్తున్నాయి.
ఇలా వరుస లేఖలతో జగన్ ను ముప్పుతిప్పలు పెడుతున్న రఘురామ తాజాగా జగన్ కు మరోలేఖ రాశారు. నవ సూచనలు (వినమ్రతతో) పేరుతో రఘురామ తాజాగా రాసిన లేఖలో జగనన్న ఇళ్లపై సెటైర్లు వేశారు. జులై 4న మరి కొన్ని గృహాలకు జగన్ శంకుస్థాపన చేయబోవడంపై ఆర్ఆర్ఆర్ విమర్శలు గుప్పించారు. విడతల వారీగా శంకుస్థాపనలు చేయడం చూస్తుంటే..యమలీల సినిమాలోని ‘‘మా చెల్లి పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ’’ డైలాగ్ గుర్తుకు వస్తోందంటూ ఆర్ఆర్ఆర్ ఎద్దేవా చేశారు.
అమృత్ పథకం ద్వారా చంద్రబాబు హయాంలో నిర్మించిన ఇళ్లను పేదలకు ఎందుకు ఇవ్వడం లేదని రఘురామ నిలదీశారు. కనీస సౌకర్యాల కల్పన లేకుండా ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టారని, వైఎస్ హయాంలో ఇంతకన్నా మెరుగైన సౌకర్యాలతో ఇళ్లు నిర్మిస్తేనే అక్కడ జనం ఉండడం లేదని గుర్తు చేశారు. నాసిరకం ఇళ్లే నిర్మించి ఇస్తే ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేక భావనలతో ఉంటారన్నారు.
త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారని, తక్కువ బడ్జెట్ వల్ల కాంట్రాక్టర్లు నాసిరకం నిర్మాణ సామగ్రితో ఇళ్లు నిర్మిస్తున్నారని విమర్శించారు. జగనన్న ఇళ్లలో బెడ్ రూం వైశాల్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే ఈ బెడ్రూం వైశాల్యం వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.