సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక చాప్టర్ ఫ్టైట్ లో ఢిల్లీకి వెళ్లిన నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వరుస పెట్టి భేటీలు అవుతున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న వీల్ ఛెయిర్ లో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ కావటం.. అనంతరం జాతీయమానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించి కంప్లైంట్ ఇవ్వటం తెలిసిందే.
తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన ఆయన తనపై పెట్టిన అక్రమ కేసులు.. ఆ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పినట్లుగా తెలుస్తోంది.
బుధవారం రాత్రి 9.20 గంటల సమయంలో స్పీకర్ నివాసంలో రఘురామ భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు వారి భేటీ సాగినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా జరిగిన పరిణామాల్ని వివరించినట్లుగా తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని తాను సీబీఐ కోర్టులో పిటిషన్ వేశానన్న కక్షతోనే తనపై అక్రమ కేసులు బనాయించినట్లుగా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన పలువురిపై ఫిర్యాదులు చేశారు. తనపై నమోదు చేసిన రాజద్రోహం కేసు.. తదనంతర పరిస్థితుల్ని వివరిస్తూ.. చర్యలు తీసుకోవాలంటూ పెద్ద జాబితానే ఇవ్వటం గమనార్హం. ఈ జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఏపీ డీజీపీ.. సీబీఐ ఏడీజీ సునీల్ కుమార్.. ఏఎ్స్పీ విజయపాల్ పై చర్యలు తీసుకోవాలన్నారు. పార్లమెంటు సభ్యుడిగా తనకున్న హక్కులకు భంగం కలిగించారని.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేశారని.. అందుకు కారణమైన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
పోలీసు విచారణలో తనకు గాయాలు అయ్యాయని.. తనకు గాయాలు ఉన్నట్లు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి ధ్రువీకరించిందన్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ కు వెళ్లిన రఘురామ రెండు కాళ్లకు పెద్ద ఎత్తున బ్యాండేజ్ లు వేయటం తెలిసిందే. బ్యాండేజ్ ఉన్న కాళ్లతో కనిపించిన రఘురామను చూసి స్పీకర్ చలించినట్లుగా చెబుతున్నారు. ఎంపీ చెప్పిన విషయాలన్ని విని.. వాటిపై విచారణ జరిపించి.. కఠినంగా చర్యలు తీసుకొని న్యాయం చేస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది.