ప్రస్తుతం ఢిల్లీలో చికిత్స పొందుతున్న నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. ఎనిమిది పేజీలు ఉన్న ఈ సుదీర్ఘ లేఖలో ఆయన ఫోకస్ అంతా గచ్చిబౌలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ తీరును తప్పు పట్టారు.
ఏపీ సీఐడీ వారు తనను తెలంగాణలోని ఇంట్లో అరెస్టు చేస్తున్న వేళ.. స్థానిక పోలీసు స్టేషన్ అయిన గచ్చిబౌలి సీఐ ఏ మాత్రం పట్టించుకోలేదని.. పలు సందర్భాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులు.. పోలీసు మాన్యువల్ చెబుతున్న మార్గదర్శకాల్ని పాటించలేదన్నారు. ఇందుకు సంబంధించిన వివరాల్ని ఆయన ఉటంకిస్తూ సుదీర్ఘ లేఖ రాశారు.
తనపై ఏపీ సీఐడీ సుమోటోగా కేసు నమోదు చేసిందని.. గుంటూరు సీఐడీ అడిషినల్ ఎస్పీ విజయపాల్ మే 14న హైదరాబాద్ గచ్చిబౌలిలోని తన నివాసమైన బౌల్డర్ హిల్స్ లోని 74వ నంబరు విల్లాకు ఒక టీం వచ్చిందన్నారు.
తనను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసేందుకు వచ్చినప్పుడు గచ్చిబౌలి సీఐ కనీసం పోలీసు మాన్యువల్స్ ను పట్టించుకోలేదన్నారు. ఎంపీగా ఉన్న తన అరెస్టుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని కూడా పరిశీలించలేదన్నారు.
ఏపీ సీఐడీ నుంచి టాన్సిట్ రిమాండ్ ఆర్డర్ తీసుకోలేదని.. అసలు ఎఫ్ఐఆర్ ఉందో లేదో కూడా తనిఖీ చేయలేదన్నారు. తనను అరెస్టు చేసే ముందు తన ఆరోగ్య పరిస్థితిపై స్థానిక ఆసుపత్రిలో పరీక్షలు చేయించాలన్న రూల్ ను పాటించలేదన్నారు.
తనను కారులోకి తోస్తున్నా.. గచ్చిబౌలి సీఐ స్పందించలేదని.. రాజ్యాంగ హక్కుల్ని కాపాడటంలో భాగంగా తన అరెస్టుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని.. అది కూడా తీసుకోలేదన్నారు.
తనను అరెస్టు చేసేందుకు ఏపీ సరిహద్దును దాటే ముందు ప్రస్తుతం ఉన్న నిబంధనలు.. మార్గదర్శకాల మేరకు తెలంగాణ ప్రభుత్వ అనుమతిని ఏపీ సీఐడీ తీసుకోలేదన్నారు. రూల్ ఆఫ్ లాను అమలు చేసేలా తెలంగాణ పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరిన రఘురామ లేఖకు సీఎం కేసీఆర్ ఏ రీతిలో రియాక్టు అవుతారోచూడాలి.
తన ఇంటికి వచ్చిన గచ్చిబౌలి సీఐపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. తన అరెస్టు ఎపిసోడ్ లో కొత్త యాంగిల్ చూపించిన రఘురామ రానున్న రోజుల్లో మరెన్ని పాయింట్లు తెర మీదకు తీసుకొస్తారో చూడాలి.