వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత రఘురామ కృష్ణరాజు గత ఐదేళ్లుగా సంచలన విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. జగన్ ఓటమిలో రఘురామ పాత్ర కూడా కీలకం అనే చెప్పవచ్చు. జగన్ పాలనాపరమైన విధానాలపై పదునైన విమర్శలు గుప్పించిన రఘురామపై జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని, సీఐడీ అధికారులను అడ్డుపెట్టుకొని కస్టోడియల్ టార్చర్ చేయించారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై రఘురామ న్యాయపోరాటం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రఘురామ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలోనే జగన్ పై రఘురామ అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టిన వైనం సంచలనం రేపుతోంది. జగన్ తో పాటు, సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ లపై గుంటూరు పోలీసులకు రఘురామ ఫిర్యాదు చేశారు. పోలీస్ కస్టడీలో తనను టార్చర్ చేశారని, చేయించారని ఆరోపిస్తూ జగన్, సునీల్, ఇతర అధికారులపై ఫిర్యాదు చేశారు. నేరపూరిత కుట్ర, హత్యాయత్నం,కస్టోడియల్ టార్చర్ ఆరోపణలు చేస్తూ కేసు పెట్టారు. 2021లో నాటి సీఎం జగన్ ఆదేశాల ప్రకారమే ఏపీ సీఐడీ అధికారులు, పోలీసులు తనను కస్టడీలో పెట్టి టార్చర్ చేశారని రఘురామ తన ఫిర్యాదులో ఆరోపించారు.
అధికారం కోల్పోయి రాజకీయ భవిష్యత్తు, పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిన జగన్ పై రఘురామ కేసు వేసిన వైనం మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లయింది. గతంలో అధికారం చేతిలో ఉంది కదా అని రఘురామపై జగన్ కక్ష సాధించారని, ఇపుడు రఘురామ వంతు వచ్చింది కాబట్టి జగన్ పై తప్పకుండా కక్ష సాధిస్తారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.