కర్ణాటక రాజకీయాల్లో సంచలన ఉదంతం చోటు చేసుకుంది. ఒక ఛీటింగ్ కేసుకు సంబంధించిన విచారణకు మాజీ సీఎం సతీమణి..నటిగా సుపరిచితురాలైన రాధిగా కుమారస్వామి హాజరయ్యారు. ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ మాజీ ముఖ్యమంత్రి సతీమణికి ఛీటింగ్ కేసుకు సంబంధం ఏమిటన్నది చూస్తే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి.
కుట్టి రాధికగా కన్నడ సినీ ఇండస్ట్రీలో కాలు మోపిన ఆమె.. తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. కెరీర్ మాంచి ఊపులో ఉన్న వేళలో కుమారస్వామిని రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ ఉదంతం అప్పట్లో పెను సంచలనంగా మారింది. పెళ్లి తర్వాత నటనకు పుల్ స్టాప్ పెట్టేశారు. నిర్మాతగా కొన్ని సినిమాలు చేశారు. అనంతరం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించటం షురూ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా 52 ఏళ్ల స్వామి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని యువరాజ్ అని పిలుస్తుంటారు.
ఒక ప్రముఖ కంపెనీకి చెందిన వ్యక్తిగా చెబుతూ.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురు దగ్గర కోట్లాది రూపాయిలు వసూలు చేశాడు. దీనికి సంబంధించిన కేసులో అతన్ని అరెస్టు చేశారు. అతడి బ్యాంకు ఖాతాల్ని పరిశీలించగా.. రాధిక కుమారస్వామికి రూ.75 లక్షల క్యాష్ బదిలీ అయినట్లుగా గుర్తించారు. దీంతో.. ఆమెను విచారణకు పిలిచారు. అయితే.. రాధిక వెర్షన్ వేరుగా ఉంది.
స్వామి అలియాస్ యువరాజ్ తనకు ఎప్పటినుంచో తెలుసని.. అతను ఒక చారిత్రక సినిమా తీస్తున్నాడని.. అందులో నటించేందుకు తాను ఒప్పుకున్నానని.. రెమ్యునరేషన్ లో భాగంగారూ.15లక్షల అడ్వాన్స్ గాఇచ్చారన్నారు. మిగిలిన మొత్తాన్ని అతడి బావమరిది అకౌంట్ ద్వారా రూ.60 లక్షలు బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాదు.. స్వామి తనకు జ్యోతిష్యుడిగా కూడా తెలుసని.. తనకు సంబంధించి అతను చెప్పిన విషయాలు ఎన్నో నిజమైనట్లుగా చెప్పారు.
అతన్ని తానెంతో నమ్మినట్లుచెప్పిన ఆమె.. ఛీటింగ్ కేసులో అతడ్ని అరెస్టు చేయటం తెలిసి తాను షాక్ తిన్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా స్వామిని అరెస్టు చేసిన ోలీసులు అతని ఇంటినుంచి రూ.91 కోట్ల విలువైన వంద చెక్కుల్నిస్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదతం ఇప్పుడు రాజకీయంగా సంచలనమైంది.