ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పీపుల్స్ స్టార్, టాలీవుడ్ నటుడు ఆర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబును సినీ పెద్దలు కలవలేదని పవన్ అసంతృప్తి వ్యక్తం చేయడంపై నారాయణమూర్తి స్పందించారు. సినీ పరిశ్రమలోని సమస్యలను చర్చించడానికి ప్రభుత్వం పిలిచి ఉంటే బాగుండేదని నారాయణమూర్తి అన్నారు. గతంలో రాజులు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకునే వారని, అదే మాదిరిగా ఇండస్ట్రీ సమస్యలు తెలుసుకోవడానికి పెద్దన్న లాగా పవన్ వ్యవహరించి ఉంటే బాగుండేదని అన్నారు.
థియేటర్లలో పర్సంటేజీ విధానంపై చాలా ఏళ్లుగా చర్చ జరుగుతోందని, అది ఒ కొలిక్కి వస్తుందనుకున్న సమయంలో హరిహర వీరమల్లు చిత్రం విడుదలకు ఆ సమస్యకు లింకు పెట్టారని అది సరికాదని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ఆ సినిమా ప్రస్తావన లేకుండా ఇండస్ట్రీలో సమస్యలపై చర్చకు సినీ ప్రముఖులను పిలిచి ఉంటే పవన్ పై గౌరవం మరింత పెరిగేదని అన్నారు
సింగిల్ స్క్రీన్ థియేటర్లో మనుగడ ప్రశ్నార్థకమైందని, పర్సంటేజీ విధానాన్ని కోరుకునే వ్యక్తుల్లో తాను కూడా ఒకడిని అని అన్నారు. ఇదే విషయంలో ఫిలిం ఛాంబర్ ముందు టెంట్ వేసి ఆందోళన నిర్వహించామని గుర్తు చేశారు. సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో ప్రేక్షకులు, పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని, వినోదం ఖరీదుగా మారిందని అభిప్రాయపడ్డారు. భారీ ఖర్చుతో సినిమా తీసి దానిని ప్రజలపై రుద్దడం సరికాదని చెప్పారు. సినిమా బాగుంటే జనాలు థియేటర్లోకి వస్తారని అన్నారు. థియేటర్లలో పాప్ కార్న్ వంటివి కొనాలంటే భయపడే పరిస్థితి ఉందని, ధరలపై నియంత్రణ ఉండాలని ఆయన చెప్పారు.