సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న విలక్షణ నటుల్లో ఫహద్ ఫాజిల్ ఒకరు. కేరళలో జన్మించిన ఫహద్.. ప్రధానంగా మలయాళం మరియు తమిళ చిత్రాల్లో పని చేశారు. హీరో గానే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ జాతీయ ఉత్తమ నటుల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నిర్మాతగా సైతం సత్తా చాటుతున్న ఫహద్ ఫాజిల్.. పుష్ప ది రైజ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం 2021లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది.
ఈ చిత్రంలో భన్వర్ సింగ్ షెకావత్ ఐపిఎస్ గా ఫహద్ ఫాజిల్ నటించారు. పుష్ప పార్ట్ 1 ఎండింగ్ లో వచ్చిన ఆయన పాత్ర.. పుష్ప 2 ది రూల్ లో మాత్రం చాలా కీలకంగా ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 కోసం ఫహద్ ఫాజిల్ భారీ స్థాయిలో పారితోషికం ఛార్జ్ చేస్తున్నారట. తాజాగా ఆయన రెమ్యునరేషన్ లెక్కలు బయటకు వచ్చి అందరిని షాక్ కి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం రోజువారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుల్లో ఫహద్ కూడా ఒకరు.
అయితే ఈయన ఒక్క రోజుకు ఏకంగా రూ. 12 లక్షలు ఛార్జ్ చేస్తున్నారట. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. షూటింగ్ కు వచ్చాక ఒకవేళ ఆ రోజు షూట్ క్యాన్సిల్ అయినా లేక వాయిదా పడినా రెమ్యునరేషన్ మాత్రం ఇవ్వాల్సిందే అట. అలాగే రెమ్యునరేషన్ రూ. 12 లక్షలతో పాటు పెనాల్టీ క్రింద ప్రొడ్యూసర్లు ఫహద్ కు మరో రూ. 2 లక్షలు చెల్లించాలట. ఈ కండీషన్ కు ఒప్పుకుంటేనే ఆయన ఏ ప్రాజెక్టైనా సైన్ చేస్తారట. ప్రస్తుతం పుష్ప 2 మూవీకి కూడా ఫహద్ ఫాజిల్ ఈ విధంగా పారితోషికం తీసుకుంటున్నాడని ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది.