ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి.. ఉరఫ్ చిన్నమ్మ.. ఎన్నికలకు ముందు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు 26 మంది ఐపీఎస్‌లు.. ఆరుగురు ఐఏఎస్‌లను మార్చాలని ఆమె రాసిన లేఖ అప్పట్లో సంచలనం సృష్టించింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక జిల్లాల్లో అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత.. పురందేశ్వరి మరో వ్యూహంతో ముందుకు వచ్చారు. రాష్ట్రంలో సర్కారు మారు తుందనే చర్చ జరుగుతున్న సమయంలో ఆమె వేసిన పాచిక.. జగన్ సర్కారుకు ఇబ్బందిగా మారిందనే వాదన వినిపిస్తోంది.
తాజాగా పురందేశ్వరి.. తన పార్టీ ముఖ్యనాయకులతో కలిసి.. గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు 12 పేజీలతో కూడిన ఫిర్యాదు, వినతి పత్రాలను సమర్పించారు. రాష్ట్రంలో జగన్ సర్కారు చేసిన అప్పులు(బ్యాంకులు).. తెచ్చిన రుణాలు(ప్రైవేటు సంస్థలు), కడుతున్న వడ్డీలు ఎంత? లెక్క బహిరంగ పరిచేలా సర్కారునుఆదేశించాలని ఆమె విన్నవించారు. అంతేకాదు. కేంద్రం ఇచ్చిననిధులను ఏం చేశారో.. ఏయే పథకాలకు కేంద్రం ఎంత నిధులుఇచ్చిందో ఆ మొత్తాలను బయట పెట్టాలని.. ఈ మేరకు సర్కారును ఆదేశించేలా ఆమె గవర్నర్‌కు విన్నవించారు.
ఇవీ.. చిన్నమ్మ విన్నపాలు..
+ ఆర్బీఐ లెక్కల ప్రకారం.. అవుట్ స్టాండింగ్ అప్పులు ఎన్ని?
+ కార్పొరేషన్ల ను అడ్డు పెట్టి తెచ్చిన అప్పుల మొత్తం వివరాలు?
+ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు ఎంత?
+ ప్రభుత్వం ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులు ఎంత?
+ ప్రభుత్వం సావనీర్ గ్యారెంటీ ఇచ్చి తెచ్చిన అప్పులు ఎన్ని?
+ ఎన్నికల అనంతరం కాంట్రాక్టర్లకు చెల్లించిన మొత్తం ఎంత?
+ ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ ను అడ్డు పెట్టి తెచ్చిన మొత్తం ఎంత?
+ ప్రభుత్వ ఉద్యోగులకు TA, DA బకాయిలు ఎంత మొత్తం ఉన్నాయి?
+ అప్పులు చెల్లించేందుకు కట్టాల్సిన అసలు+ వడ్డీ ఎంత?
+ సివిల్ సప్లయర్స్ కార్పొరేషన్‌కు, డిస్కంలకు, పవర్ సప్లయర్స్‌లకు చెల్లించాల్సిన బకాయిలు ఎంత?
+ రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టుల్లో ఎన్ని కేసులు ఉన్నాయి?