ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై సర్వత్రా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ చేసిన పనిపై పలువురు విపక్ష పార్టీల అధినేతలతోపాటు నందమూరి కుటుంబ సభ్యులు కూడా మండిపడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై ఏపీ బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి విమర్శలు గుప్పించారు. పేర్లను మార్చడంలో జగన్ కు ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో ఉన్న సమస్యలను తీర్చడంపై లేదని ఎద్దేవా చేశారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో నుంచి ఎన్టీఆర్ పేరును తీసి వేయడం ఎన్టీఆర్ ను అవమానించినట్టేనని ఆమె అన్నారు. స్వలాభాపేక్ష లేకుండా ఎన్టీఆర్ పాలన సాగించారని, కానీ, ఇప్పటి పాలకులు అందుకు విరుద్ధమని దుయ్యబట్టారు. ఆ పేరు ఎందుకు మార్చారో రాష్ట్ర ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఓ వైపు ఎన్టీఆర్ పై తనకు అపార గౌరవం ఉందంటోన్న జగన్ ఆయన పేరును తొలగించడం అన్యాయమని మండిపడ్డారు.
జగన్ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్తోందని, మద్య నిషేధం విధిస్తామన్న జగన్… మహిళలను మోసం చేశారని పురంధేశ్వరి దుయ్యబట్టారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చలేదని, రాష్ట్రానికి కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా జగన్ తేలేదని మండిపడ్డారు. అంతేకాదు, జగన్ పాలనకు భయపడి పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు, భూకబ్జాలే కనిపిస్తున్నాయని ఆరోపించారు.
ఈ వ్యవహారంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కూడా స్పందించారు. ఎన్టీఆర్ పేరును తొలగించాలనే నిర్ణయాన్ని జగన్ సొంత చెల్లెలు షర్మిల కూడా తప్పుపట్టారని గుర్తు చేశారు. ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలని జగన్ కు షర్మిల కూడా సూచించారని వెల్లడించారు. తన రాజ్యంలో ఎవరు ఎదురు తిరిగినా వారిని ఖతం చేస్తాననే తరహాలో జగన్ పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. ఉత్తరాంధ్రలో అమరావతి రైతుల యాత్రకు బీజేపీ రక్షణ కవచంగా ఉంటుందని, అమరావతి రైతులపై దాడి చేస్తే బీజేపీపై చేసినట్టేనని చెప్పారు. ఈ ప్రభుత్వం ప్రజలకు రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటోందని అన్నారు.