పుదుచ్చేరిలో నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో జరిగిన బల నిరూపణలో నారాయణ స్వామి ఓడిపోవడంతో నాలుగున్నర ఏళ్ల కాంగ్రెస్ పాలన ముగిసింది. బల నిరూపణలో ఓటమిపాలైన తర్వాత తన రాజీనామా లేఖను తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి తాత్కాలిక గవర్నర్ తమిళి సైకు అందించారు. ఈ సందర్భంగా బీజేపీపై నారాయణ స్వామి విరుచుకుపడ్డారు.
నాలుగేళ్లకు పైగా ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించానని, అటువంటి తన ప్రభుత్వాన్ని బీజేపీ, మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కుప్పకూల్చారని ఆరోపించారు. విపక్ష ఎమ్మెల్యేలకే కిరణ్ బేడీ మద్దతుగా నిలిచి, సంక్షేమాన్ని వదిలేశారని నారాయణ స్వామి మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాలను ఆమె అడ్డుకున్నారని, పథకాలను ప్రజలకు చేరనివ్వలేదని ఆరోపించారు. మరోసారి ప్రజాతీర్పు కోరతానని, రాజీనామాలు చేసిన కాంగ్రెస్ నేతల మనసులు మారతాయని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు.
కాగా, నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, మరో ఎమ్మెల్యే ఉద్వాసనకు గురవడంతో నారాయణ స్వామి ప్రభుత్వం అసెంబ్లీలో మైనారిటీలో పడింది. కాంగ్రెస్-డీఎంకే ప్రభుత్వానికి ఆదివారం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. 33 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వ బలం 11కు పడిపోయింది. తాజాగా రాజీనామా చేసిన వారిలో ఒకరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాగా, మరొకరు భాగస్వామ్య పార్టీ డీఎంకే ఎమ్మెల్యే.