కూటమి పార్టీల సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియాల మధ్య వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఆడవాళ్లపై వైసీసీ సోషల్ మీడియా కార్యకర్తలు అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. కొందరు సైకోలు సైకో పార్టీలతో కలిసి సోషల్ మీడియాను భ్రష్టుపట్టించారని వైసీపీపై పరోక్షంగా షర్మిల చురకలంటించారు.
మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మృగాల్లా మారారని, తల్లి, చెల్లి అనే ఇంగిత జ్ఞానం లేకుండా పోస్టులు పెట్టారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే మహిళలపై అసభ్యకర పోస్టులతో రాక్షసానందం పొందారని ధ్వజమెత్తారు. సోషల్ మీడియా సైకోల బాధితుల్లో తాను కూడా ఉన్నానని, అసభ్యకర పోస్టులతో తన పరువు ప్రతిష్ఠలు దెబ్బతీసేలా వ్యవహరించారని షర్మిల ఆరోపించారు. దారుణమైన పోస్టులతో పైశాచికానందం పొందే సైకోలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తనపై, తన తల్లి విజయమ్మపై, తన సోదరి సునీతపై విచ్చలవిడిగా పోస్టులు పెట్టారని, తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదని దారుణాతిదారుణంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరికి తన ఇంటి పేరు కూడా మార్చి రాక్షసానందం పొందారని భావోద్వేగానికి లోనయ్యారు. తనపై సైకోలా పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు.