విజయనగరం వైసీపీలో వర్గ పోరు రచ్చకెక్కింది. వైసీపీలోని అంతర్గత విభేదాలు తాజాగా తారస్థాయికి చేరుకున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా స్థానిక వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. జగనన్న ముద్దు కడుబండి వద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. జగనన్న సురక్ష కార్యక్రమం సందర్భంగా శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా కొందరు వైసీపీ కార్యకర్తులు, స్థానికులు పోస్టర్లు ప్రచురించారు. స్థానిక ఎమ్మెల్యే తీరుపై శృంగవరపుకోటవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఎమ్మెల్యే మాకొద్దు అంటూ ఎస్.కోటవాసులు….శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా ఇళ్ల గోడలపై పోస్టర్లు అంటించారు. 2019 ఎన్నికలకు ముందు కడుబండి శ్రీనివాసరావుకు ఎస్.కోట లో ఓటే లేదని, అయినా సరే జగనన్న చెప్పారని ఆయనను గెలిపించున్నామని స్థానికులు అంటున్నారు. మండలంలోని ప్రతి వైసీపీ కార్యకర్త కడుబండి గెలుపు కోసం కృషి చేశారని, 3000 మెజారిటీతో గెలిపించుకున్నామని అంటున్నారు.
కడుబండికి పదవీ వ్యామోహం ఉందని, ఆయనకు టికెట్ ఇచ్చిన వ్యక్తినే విస్మరించారని ఆరోపిస్తున్నారు. కార్యకర్తలను, స్థానిక నేతలను శ్రీనివాసరావు పట్టించుకోవడంలేదని, కష్టపడి గెలిపించిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని స్థానికులు, వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వైసీపీలో వర్గ పోరు ఈ స్థాయికి చేరడం, ఒక్కొక్క జిల్లాలో వైసీపీ నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పించడంతో వైసీపీ అధిష్టానం తలలుపట్టుకుంటోంది.
అయితే, వైసీపీ ఎమ్మెల్యేలపై సొంతపార్టీ కార్యకర్తల నుంచే ఈ స్థాయి నిరసన వ్యక్తమవుతున్నప్పటికీ…ఆ పార్టీ నేతలు మాత్రం పగటి కలలు కంటున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. వై నాట్ 175 అంటూ జగన్ కాన్ఫిడెంట్ గా ఉన్నది కడుబండి వంటి నేతలను చూసేనా అని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. రాబోయే ఎన్నికలలో జగన్ కు ప్రజలు బుద్ధి చెబుతారని ఘాటుగా టీడీపీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు.