ఈ రోజుల్లో సినిమా ల నిర్మాణం జూదం లాగా మారిపోయింది. పారితోషకాలు పెరిగిపోతున్నాయి.. బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. కానీ పెట్టిన బడ్జెట్‌కు తగ్గ బిజినెస్ జరగట్లేదు. సినిమాల సక్సెస్ రేట్ తగ్గిపోతోంది. చాలా సినిమాలు డెఫిషిట్‌తోనే రిలీజవుతున్నాయి. సినిమాకు టాక్ అటు ఇటు అయితే నిర్మాతలు నిండా మునిగిపోతున్నారు. ఇటీవల భోళా శంకర్ సినిమా వల్ల నిర్మాత అనిల్ సుంకర ఎంత ఇబ్బంది పడ్డారో తెలిసిందే.
ఐతే ఆయనకు స్టామినా ఉంది కాబట్టి సినిమాను ఎలాగోలా రిలీజ్ చేసుకున్నారు. రిజల్ట్ తేడా కొట్టినా తట్టుకున్నారు. కానీ విజయ్ జాగర్లమూడి అనే చిన్న నిర్మాత తన స్థాయికి మించి ఖర్చు పెట్టి సినిమా తీసి.. అది విడుదల కాక తీవ్ర ఇబ్బందులు పడుతూ.. ఆ క్రమంలో గుండెపోటుకు గురై ఆసుపత్రి పాలయ్యాడు. ఇప్పుడీ వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
విజయ్ జాగర్లమూడి.. రాకేష్ జాగర్లమూడి అనే తన ఫ్యామిలీ కుర్రాడినే హీరోగా పెట్టిన ఖుదీరాం బోస్ అనే సినిమాను నిర్మించాడు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కుడు ఖుదీరాం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది.
విద్యాసాగర్ రాజు నిర్మాత. గత ఏడాది ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన అమృతోత్సవ వేడుకల్లో భాగంగా ఈ సినిమాను మొదలుపెట్టి పూర్తి చేశాడు విజయ్. ఈ చిత్రాన్ని గత ఏడాది చివర్లో పార్లమెంట్ వేడుకల్లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ చిత్రం ఒక ఇంటర్నేషనల్ అవార్డ్ కూడా గెలుచుకుంది. కానీ సినిమా పూర్తయి చాలా కాలం అయినా విడుదలకు నోచుకోలేదు. బహుశా ఈ చిత్రానికి బిజినెస్ జరిగి ఉండకపోవచ్చు. సినిమా రిలీజ్ కాక ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి విజయ్ ఒత్తిడికి గురై గుండెపోటు తెచ్చుకున్నాడట. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటో సోషల్ మీడియాలో తిరుగుతోంది.