2023 లో విడుదలైన `బేబీ` మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటిస్తే.. తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అల్లు అర్జున్, రామ్ పోతినేని వంటి హీరోలు సైతం వైష్ణవి చైతన్య యాక్టింగ్ ను అభినందించారు. అయితే తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు ఇచ్చి ప్రోత్సహించాలని ఓవైపు హీరోలు వేదికలపై గట్టిగా చెబుతుంటే.. తాజాగా బేబీ నిర్మాత ఎస్కేఎన్ మాత్రం ఇకపై తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయమని, ఛాన్సులు ఇవ్వమని షాకింగ్ ప్రకటన చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
`లవ్ టుడే` మూవీతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్.. ఫిబ్రవరి 21న `రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్`తో ఆడియెన్స్ ను పలకరించబోతున్నాడు. అశ్వత్ మరిముత్తు దర్శకుడు కాగా.. అనుపమ పరమేశ్వరన్, కయదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీస్ వారు రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం హైదరాబాద్ లో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్లో నిర్మాత ఎస్కేఎన్ తెలుగమ్మాయిలను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ వివాస్పదం అయ్యాయి.
వేదికపై హీరోయిన్ కయదు లోహర్ పేరును కూడా సరిగ్గా పలకలేకపోయినా ఎస్కేఎస్.. `మేము తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు రాని అమ్మాయిలనే ఎక్కువగా లవ్ చేస్తుంటాం. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే తర్వాత ఏం జరుగుతుందో నాకు బాగా తెలిసింది. అందుకే నేను, మా డైరెక్టర్ సాయి రాజేశ్ తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని నిర్ణయించుకున్నాం` అంటూ వ్యాఖ్యానించారు. దీంతో నెటిజన్లు ఎస్కేఎన్పై విమర్శల వర్షం కురిస్తున్నారు. తెలుగులో సినిమాలు తీస్తూ తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వనని చెప్పడం దారుణమని మండిపడుతున్నారు. రూల్స్ పెడతారనే సాకుతో ఎంతో ప్రతిభ ఉన్న తెలుగమ్మాయిలను పక్కనబెట్టి.. టాలెంట్ లేని తెల్లతోలు తారల వెనుక పడటం మీకు అలవాటేగా అంటూ నెటిజన్లు కామెంట్ల మోత మోగిస్తున్నారు.