సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల నిరీక్షణకు మరికొన్ని రోజుల్లోనే తెరపడబోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన గుంటూరు కారం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతికి విపరీతమైన పోటీ నెలకొనడం, అందువల్ల థియేటర్ల సమస్య తలెత్తడం, దీనికి తోడు గుంటూరు కారం సినిమాకు సంబంధించి అనేక నెగిటివ్ వార్తలు హల్ చల్ చేయడం అభిమానులను కంగారు పెడుతోంది.
అయితే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆందోళనను గమనిస్తున్న గుంటూరు కారం నిర్మాత నాగవంశీ.. వారి టెన్షన్ తీర్చే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాకు సంబంధించి ఏ విషయంలోనూ ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని నాగ వంశీ స్పష్టం చేశాడు.
గుంటూరు కారం చిత్రానికి అనేక ఏరియాల్లో సరైన థియేటర్లు దక్కట్లేదన్న విషయమై నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు. రెండు తెలుగు రాష్ట్రాలన్నీ అన్ని ఏరియాల్లోనూ గుంటూరు కారం చిత్రానికి అత్యధిక, బెస్ట్ స్క్రీన్లు లాక్ అవుతున్నాయని.. థియేటర్ల కేటాయింపు విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని చూసి కంగారు పడవద్దని నాగ వంశీ అన్నాడు.
ఎక్కడైనా సరైన థియేటర్లు ఈ సినిమాకు దక్కట్లేదని, తక్కువ స్క్రీన్లు ఇస్తున్నారని తెలిస్తే ఆ విషయం తమ దృష్టికి తీసుకువస్తే సమస్యను పరిష్కరిస్తామని అతను చెప్పాడు. ఇక సినిమాలో కంటెంట్ గురించి మాట్లాడుతూ అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో గుంటూరు కారం ఉంటుందని.. వారం తర్వాత సినిమాకు స్క్రీన్లు పెరుగుతాయని, తాను ముందు అన్నట్లే మహేష్ కెరీర్ లో ఇది హైయెస్ట్ గ్రాఫర్ కావడం ఖాయమని మహేష్ ఫ్యాన్స్ పెట్టుకున్న ట్విట్టర్ స్పేస్ లోకి వచ్చి మరీ ధీమాగా చెప్పాడు నాగ వంశీ. సంక్రాంతి సినిమాల్లో ఏవి పక్కాగా వస్తాయి అనే విషయం మరి కొన్ని రోజుల తర్వాత కానీ క్లారిటీ రాదని నాగ వంశీ చెప్పడం గమనార్హం.