`పుష్ప 2` విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం యావత్ టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది. అయితే ఈ ఘటన మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. `గేమ్ ఛేంజర్` ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అపశృతి జరిగింది. శనివారం రాజమండ్రిలో ఎంతో అట్టహాసంగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో.. మెగా అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
దాదాపు లక్ష మందికి పైగా అభిమానులు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ను చూసేందుకు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంతో కోలాహలంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే గేమ్ ఛేంజర్ ఈవెంట్ లో పాల్గొని తిరిగి ఇళ్లకు వెళ్తున్న క్రమంలో కాకినాడ జిల్లా గైగోలుపాడు కు చెందిన ఆరవ మణికంఠ(23) తోకాడ చరణ్(22) ప్రమాదవశాత్తు మరణించారు. రంగంపేట మండలం కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో ఓ వ్యాన్ ఢీకొనడంతో ఆరవ మణికంఠ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన చరణ్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశాడు.
అభిమాన హీరోలను చూసేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో మణికంఠ, చరణ్ కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు వెంటనే స్పందించారు. అభిమానుల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా జరిగిందన్న సంతోషంలో ఉన్న సమయంలో ఇలా జరగడం ఎంతో బాధాకరమన్నారు. మణికంఠ, చరణ్ కుటుంబాలకు తాను అండంగా ఉంటానని, తన వంతుగా వారి కుటుంబాలకు చెరో రూ. 5 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందిస్తానని దిల్ రాజు ప్రకటించారు. బాధిత కుటుంబాలకు దిల్ రాజు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.