తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత, సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీ జాగీరా? అని నిలదీశారు. ఇక్కడ నియంతృత్వ పాలన సాగుతోందని నిప్పులు చెరిగారు. అదేసమయంలో తెలంగాణ ఎందుకు ఇచ్చారో కూడా.. ఆమె చెప్పుకొచ్చారు. “తెలంగాణ మీకు నేల కాదు.. తల్లి వంటింది“ అని ఆమె వ్యాఖ్యానించారు. సరూర్నగర్లో కాంగ్రెస్ నిర్వహించిన యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఆసాంతం.. ఆమె ఉద్వేగంగా ప్రసంగించారు.
తొలుత `జైబోలో తెలంగాణ` అంటూ.. ప్రియాంక గాంధీ ప్రసంగం ప్రారంభించారు. ‘‘తెలంగాణ మీకు తల్లి వంటిది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ కోసం ఎందరో ఆత్మ బలిదానాలు చేశారు. మా కుటుంబం కూడా ఎన్నో త్యాగాలు చేసింది. ఆ బాధ ఏంటో మాకు తెలుసు. తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం అంత ఈజీగా చేసింది కాదు. తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రత్యేక రాష్ట్రం ఇవ్వలేదు. ప్రజల ఆకాంక్షల మేరకే సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చి 9 ఏళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేర లేదు“ అని ప్రియాంక అన్నారు.
అంతేకాదు.. ఆత్మబలిదానాలు వృధా కాకూడదనే ఉద్దేశంతోనే సోనియా గాంధీ అనేక విమర్శలు ఎదుర్కొని, ఇబ్బందులు భరించి కూడా తెలంగాణ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ కోసం అన్ని వర్గాలవారు పోరాడారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు తెలంగాణ తమ జాగీరులా భావిస్తున్నారని ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. 9 ఏళ్లలో ప్రభుత్వం ఒక్క యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదని, ప్రైవేట్ యూనివర్సిటీలకు మాత్రం అనుమతులు ఇస్తున్నారని దుయ్యబట్టారు. బడ్జెట్లో విద్యకు కేటాయింపులు తగ్గించారని ధ్వజమెత్తారు. ప్రతి వ్యక్తిపై రూ.వేల అప్పులు మోపారని, కాంగ్రెస్ అబద్ధపు వాగ్ధానాలు చేయదని.. ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తామని ప్రియాంకగాంధీ ప్రకటించారు.
ఎన్నికల హామీలు..
ఈ పర్యటనలోనే ప్రియాంక గాందీ ఎన్నికల వరాలు కురిపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ. 4 వేలు భృతి ఇస్తామని ప్రకటించారు. యువతకు రూ. 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని తెలిపారు. ఆత్మహత్యలు చేసుకోకుండా రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.