ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాజకీయ చిత్రాల పరంపర కొత్తేమీ కాదు. గత ఎన్నికలకు ముందు కూడా అరడజనుకు పైగా సినిమాలు వచ్చాయి. ఈసారి కూడా అదే స్థాయిలో సినిమాలు రిలీజ్ చేశారు. వాటిలో జనం మీద ప్రభావం చూపినవి అరుదే. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన వివేకం అనే చిన్న సినిమా వైసీపీకి గట్టిగానే డ్యామేజ్ చేసిన సంకేతాలు కనిపించాయి. ప్రభుత్వ వ్యతిరేకతకు అది చిహ్నంగా కూడా భావించారు. ఎన్నికలకు సరిగ్గా మూడు రోజుల ముందు రిలీజైన నారా రోహిత్ చిత్రం ప్రతినిధి-2 విడుదలైంది.
ఆ సినిమా కూడా వైసీపీని డ్యామేజ్ చేసేలా.. టీడీపీకి ప్లస్ అయ్యేలా మంచి ఇంపాక్ట్ చూపిస్తుందని భావించారు. దీని టీజర్, ట్రైలర్ అయితే ఆసక్తికరంగా అనిపించాయి. కానీ ఈ రోజు రిలీజైన సినిమా చూస్తే మాత్రం ప్రోమోల్లో ఉన్న స్పార్క్ ఫుల్ మూవీలో లేదని తేలిపోయింది.
అసలు ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నారో క్లారిటీ కూడా లేని పరిస్థితి. జర్నలిస్టును సూపర్ హీరోగా చూపించడం మరీ అతిగా అనిపిస్తే.. అసలు విలన్లుగా ఎవరిని చూపించాలనుకున్నారన్నది అర్థం కాకుండా పోయింది. ఇందులో సచిన్ ఖేద్కర్ చేసిన సీఎం పాత్ర వైఎస్‌ను తలపించేలా ఉంది. కానీ ఆ పాత్రను చాలా వరకు మంచిగానే చూపించారు. చివర్లో నెగెటివ్ షేడ్స్ గురించి చెప్పీ చెప్పకుండా చెప్పి సీక్వెల్ అనేశారు. కొడుకు పాత్ర జగన్‌ను పోలినట్లు కనిపిస్తుంది. కానీ దాని స్క్రీన్ టైం చాలా తక్కువ.
ఆ పాత్ర ద్వారా విలనీని కూడా సరిగా చూపించలేదు. మొత్తంగా రాజకీయ నాయకులందరూ దొంగలే అన్నసంకేతాలు కనిపించాయి సినిమాలో. ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈజీగా బాంబు పెట్టి సీఎంనే చంపేసినట్లు చూపించడం.. తర్వాత చూస్తే సీఎం బతికి రావడం.. ఈలోపు బాడీ ఎవరిదో కూడా చూసుకోకుండా అంత్యక్రియలు చేసి నివాళి అర్పించేయడం.. ఇలా కనీసం లాజిక్ లేకుండా సిల్లీగా సీన్లను నడిపించేశాడు జర్నలిస్ట్ అయిన మూర్తి. సీఎంతో వ్యవహారం ఇంత సిల్లీగా చూపించడంతో ముందే సినిమా మీద ప్రేక్షకులు ఆసక్తి కోల్పోయిన పరిస్థితి. మొత్తంగా ప్రతినిధి-2 ఎన్నికల ముంగిట ఏపీ జనాలమీద పెద్దగా ప్రభావం చూపేలా కనిపించడం లేదు.