జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సినీ పరిశ్రమ మద్దతు ఎవరికి? ఇప్పుడు అందరిలోనూ ఈ సందేహం నెలకొంది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నపుడు సినిమా వాళ్లు తమకు నచ్చిన పార్టీకి మద్దతుగా ప్రకటనలు చేసేవాళ్లు. ప్రచారాలకు దిగేవాళ్లు. కానీ రాష్ట్రం విడిపోయాక సినీ నటుల రాజకీయాలు ఏపీకే పరిమితం అయ్యాయి.
వివిధ కారణాల వల్ల తెలంగాణ రాజకీయాల్లో సినీ నటులు పెద్దగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఎవరికీ అనుకూలంగా కానీ, ప్రతికూలంగా కానీ మాట్లాడట్లేదు. తమ ఆస్తులు కాపాడుకోవడానికి, ఇంకే రకంగానూ ఇబ్బంది పడకుండా ఉండేందుకు అధికార పార్టీతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు. టీఆర్ఎస్ పార్టీకి పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్నారు. కానీ ఆ విషయాన్ని కూడా బహిరంగంగా చెప్పడానికి భయమే. ఎప్పుడేమైనా జరగొచ్చు, ఒక స్టాండ్ తీసుకోవడం ఎందుకనో ఏమో.. అలాంటి ప్రకటనలు, ప్రచారాల జోలికి వెళ్లట్లేదు.
ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎన్నికల విషయానికొస్తే సినీ ప్రముఖులు ఎవ్వరూ కూడా ఏ పార్టీ తరఫునా ప్రచారాలు చేయలేదు. అనుకూల ప్రకటనలు కూడా చేయలేదు. ఐతే ఒక్క ప్రకాష్ రాజ్ మాత్రం తన వైఖరిని స్పష్టం చేశాడు. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఆయన జై కొట్టాడు. తెలంగాణలో కొండారెడ్డిపల్లి అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పటి నుంచి ఆయన టీఆర్ఎస్ మద్దతుదారుగానే కనిపిస్తున్నారు. అప్పట్నుంచి ప్రభుత్వ పెద్దల్ని తరచుగా కలుస్తున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల అధికార పార్టీ మద్దతుతో నడిచే పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చి అందులో కేసీఆర్‌ను ఆకాశానికెత్తేశారు. ఆ పార్టీని ఢీకొడుతున్న బీజేపీ అంటే ప్రకాష్ రాజ్‌కు అస్సలు పడదు. ఆ పార్టీ మీద కొన్నేళ్లుగా పోరాడుతున్నాడు. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి కూడా బీజేపీనే కావడంతో అధికార పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఆయన సంకోచించలేదు. టీఆర్ఎస్కు ఓటేయాలంటూ ఆయన ట్విట్టర్లో స్పష్టంగా పేర్కొన్నారు.