గతంలో ఎన్నడూ లేని విధంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపిన సంగతి తెలిసిందే. మంచు విష్ణుతో అధ్యక్ష పదవికి పోటీ పడి ఓడిపోయిన ప్రకాశ్ రాజ్, ఎన్నికల్లో గెలుపొందిన ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లోని 10 మంది సభ్యులు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కౌంటింగ్ లో బ్యాలెట్ పత్రాలు మారిపోయాయని తమ సభ్యులు లీడింగ్ లో ఉండగానే.. ఫలితాలు తారుమారు చేశారని ప్రకాశ్ రాజ్ బృందం ఆరోపించింది.
కానీ, ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని, ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని ఎన్నికల అధికారి క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆ వివరణతో సంతృప్తి చెందని ప్రకాశ్ రాజ్…తాజాగా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు లేఖ రాశారు. పోలింగ్ జరిగిన రోజు సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని ఆ లేఖలో కోరినట్లు ప్రకాశ్‌రాజ్ తెలిపారు. ఈసీ త్వరగా స్పందించకుంటే సీసీటీవీ ఫుటేజ్‌ను తొలగించడం లేదా మార్చడం చేస్తారని ప్రకాశ్ రాజ్ అనుమానం వ్యక్తం చేశారు. పోలింగ్ నాడు కొంతమంది వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, మోహన్‌బాబు, నరేశ్ తమ సభ్యులను బెదిరించారని, దాడులకు పాల్పడ్డారని ప్రకాశ్‌రాజ్ ఆరోపించారు.
వారిని, వారి అనుచరులను పోలింగ్ జరిగే ప్రాంతాల్లోకి పోలింగ్ ఆఫీసరే అనుమతించారని భావిస్తున్నామని ప్రకాశ్ రాజ్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికలు జరిగిన తీరు జనంలో మా సభ్యులను చులకన చేసిందని, అసలేం జరిగిందన్నది తెలుసుకోవాలని మా సభ్యులు కూడా అనుకుంటున్నారని ప్రకాశ్ రాజ్ అన్నారు. పోలింగ్ నాటి సీసీటీవీ దృశ్యాలు కోరే హక్కు తమకుందని, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 3 నెలల వరకు ఆ ఫుటేజ్ భద్రపరచడం ఈసీ బాధ్యత అని ప్రకాశ్‌రాజ్ లేఖలో పేర్కొన్నారు. తమకు వాటిని అప్పగించడం పోలింగ్ ఆఫీసర్ బాధ్యత అంటూ ప్రకాశ్ రాజ్ ఆ లేఖలో తెలిపారు.