కంచెం సినిమాతో టాలీవుడ్ లో పాపులర్ అయిన అందాల సోయగం ప్రగ్యా జైస్వాల్ ఇటీవల కాలంలో నటసింహం నందమూరి బాలకృష్ణతో కలిసి బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన `అఖండ` భారీ విజయాన్ని నమోదు చేసింది. రీసెంట్ గా `డాకు మహారాజ్` చిత్రంలో బాలయ్యకు జోడిగా ప్రగ్యానే నటించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన డాకు మూవీ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ 2` చేస్తున్నారు. ఈ సినిమాలోనూ ప్రగ్యానే హీరోయిన్. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగ్యా జైస్వాల్.. బాలకృష్ణతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం మరియు తమ మధ్య ఏజ్ గ్యాప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలకృష్ణ గారు చాలా మంచి వ్యక్తి. అందర్నీ ఒకేలా గౌరవిస్తారు. ఆయన పేరు వింటే నాకు పాజిటివిటీ అనే పదం గుర్తొస్తుంది. ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని ప్రగ్యా చెప్పుకొచ్చింది.
బాలకృష్ణ సార్ తో వరుస సినిమాలు చేయడం చాలా ఆనందంగా ఉందని.. అఖండలో మా ఇద్దరినీ స్క్రీన్ పై చూసి ఆశ్చర్యపోయానని తెలిపింది. అలాగే పాత్రకు ఎవరు సరిపోతారు అన్నది చూశాకే యాక్టర్స్ కు ఛాన్స్ ఇస్తారు.. అంతే తప్ప వారి వయస్సును చూసి ఎవ్వరూ అవకాశాలు ఇవ్వరని ప్రగ్యా తెలిపింది. పాత్రకు వంద శాతం న్యాయం చేశానా? లేదా? అనేదే తాను ఆలోచిస్తానని.. తన దృష్టిలో ఏజ్ అనేది అసలు సమస్యే కాదని ప్రగ్యా జైస్వాల్ పేర్కొంది.
ఇక తన బర్త్ డే రోజునే డాకు మహారాజ్ విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోవడం నిజంగా ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని.. మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి తనను అందరూ డాకు మహారాణి అని పిలుస్తున్నారని ఈ సందర్భంగా ప్రగ్యా జైస్వాల్ చెప్పుకొచ్చింది.