పది రూపాయిలు దానం చేసి పదిసార్లు చెప్పుకునే వారున్న ఈ రోజుల్లో కుడి చేత్తో సాయం చేస్తే ఎడమ చేతికి తెలియనివ్వని గొప్ప మనసున్న ప్రభాస్ కూడా ఉన్నాడు. రాజ్యాలు లేకపోవచ్చు.. కానీ ప్రభాస్ మాత్రం నిజంగా ఒక రాజే. అతని దాన గుణానికి దాసోహం కాని వారుండరు. ప్రభాస్ కు టాలీవుడ్ కర్ణుడు అనే పేరు కూడా ఉంది. అయితే ప్రభాస్ చేసే గొప్ప పనుల్లో బయటకు వచ్చేవి కొన్ని మాత్రమే.. కానీ బయటకు రానివి మరెన్నో. తాజాగా ప్రభాస్ కు సంబంధించి ఓ షాకింగ్ విషయాన్ని ప్రముఖ రచయిత తోట ప్రసాద్ బయట పెట్టారు.
బిల్ల చిత్రానికి రచయితగా పని చేసిన తోట ప్రసాద్ ఈరోజు సజీవితంగా ఉన్నారు అంటే అందుకు కారణం ప్రభాసే అట. ఓవైపు తన ప్రాణానికి ప్రాణమైన తండ్రి చనిపోయి శవమై ఉంటే.. మరోవైపు ప్రభాస్ మరో ప్రాణాన్ని నిలబెట్టేందుకు క్షణం కూడా ఆలోచించలేదట. తండ్రిని కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న సమయంలోనూ ప్రభాస్ తన దాన గుణాన్ని విడిచిపెట్టలేదట. ప్రభాస్ చేసిన సాయాన్ని ఎప్పటికీ మరచిపోలేనంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రచయిత తోట ప్రసాద్ తెలిపారు.
ప్రసాద్ మాట్లాడుతూ.. `ప్రభాస్ నిజంగా గొప్పవాడే. బిల్లా సినిమా సమయంలో ఆయనతో పరిచయం ఏర్పడింది. చిన్నపాటి పరిచయానికే ఆయన నాకు జీవితాంతం గుర్తుండిపోయే సహాయాన్ని చేశారు. 2010లో నేను తీవ్రమైన అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాను. ఆరోజు సరైన ట్రీట్మెంట్ అందకపోయుంటే ఈ రోజు నేననే వాడిని ఉండేవాడినే కాదు. నేను హాస్పిటల్ లో చేరిన విషయాన్ని తెలుసుకున్న ప్రభాస్ వెంటనే డబ్బును పంపాడు. అందులో గొప్ప విషయం ఏముంది అనుకోవచ్చు. నిజానికి నేను హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజే ప్రభాస్ తండ్రి గారు చనిపోయారు. తండ్రి దూరమై శోకసంద్రంలో ఉన్న సమయంలో కూడా నా వైద్యానికి అవసరమయ్యే డబ్బులు పంపించి నా ప్రాణాలు కాపాడాడు` అంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు, నెటిజన్లు ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇండియన్ సినీ పరిశ్రమ మొత్తం వెతికినా ప్రభాస్ లాంటి గొప్ప మనసున్న వ్యక్తి ఉండడంటూ అభిప్రాయపడుతున్నారు.