అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కెరీర్ స్టార్టింగ్ లో హ్యాట్రిక్ ఫ్లాపులను మూటగట్టుకున్న ఈయన.. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో `ఏజెంట్` అనే చిత్రం చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా నేషనల్ స్టార్ ప్రభాస్ పై అఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన్ను కలిస్తే జాగ్రత్తగా ఉండాలంటూ అఖిల్ పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. అఖిల్ తల్లి, ఒకప్పటి హీరోయిన్ అమల అక్కినేని లాంగ్ గ్యాప్ తర్వాత `ఒకే ఒక జీవితం` మూవీతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించారు.
శ్రీకార్తిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు నిర్మించారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో శర్వానంద్ తల్లి పాత్రలో అమల అక్కినేని కనిపించనున్నారు. అలాగే వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ కీలక పాత్రలను పోషించారు. సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది.
ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. మరోవైపు మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే `అమ్మ చేతి వంట` పేరుతో ఓ స్పెషల్ ప్రోగ్రామ్ ను ప్లాన్ చేశారు. ఈ ప్రోగ్రామ్ లో అమల, శర్వానంద్ లతో పాటు అఖిల్ కూడా పాల్గొన్నాడు. అయితే తాజాగా ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది.
ఇందులో `ఒకే ఒక జీవితం` సినిమా గురించి ఎన్నో విషయాలను చర్చించుకున్నారు. ఆ తర్వాత అమల.. శర్వానంద్, అఖిల్ కోసం వంట చేసింది. ఈ క్రమంలోనే అమల మాట్లాడుతూ ప్రభాస్ ఫుడ్ ను అమితంగా ఇష్టపడే వ్యక్తి అని విన్నాను అనగా.. వెంటనే శర్వానంద్ పెద్ద ఆహార ప్రియుడంటూ బదులిచ్చాడు.
మరోవైపు ఈ విషయంపై అఖిల్ స్పందిస్తూ.. `అందుకే ప్రభాస్ ను కలిసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే ఇక అంతే. చాలు తినలేనని చెప్పినా అస్సలు వదిలి పెట్టడు` అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పుడు అఖిల్ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. కాగా, ప్రభాస్ ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. తోటి నటులు ఎవరైనా సరే ప్రభాస్ నటనను ఎంతగా మెచ్చుకుంటారో ఆయన ఆతిథ్యంపై సైతం అంతలానే పొగడ్తల వర్షం కురిపిస్తుంటారు.