సీఎం చంద్రబాబు నేతృత్వంలో 24 మంది మంత్రుల తో ఏపీ మంత్రివర్గం కొలువుదీరిన సంగతి తెలిసిందే. జూన్ 12న ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగోసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా…ఆయనతోపాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. అయితే, వారికి ఏ ఏ శాఖలు కేటాయించాలి అన్న విషయంపై టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే నిన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు తాజాగా తన మంత్రివర్గంలో ఎవరికి ఏ శాఖ కేటాయించారో వెల్లడించాు.
సీఎం చంద్రబాబు సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ), శాంతి భద్రతలు(లా అండ్ ఆర్డర్), ఎవరికీ కేటాయించని శాఖలను తన వద్దనే ఉంచుకున్నారు. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితోపాటు పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా వంటి కీలక శాఖలను అప్పగించారు. ఇక, గతంలో ఐటీ శాఖా మంత్రిగా పనిచేసిన అనుభవమున్న నారా లోకేశ్ కు మరోసారి ఐటీ శాఖతోపాటు మానవ వనరులు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖలు అప్పగించారు.
ఏపీ మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే…
సీఎం చంద్రబాబు- సాధారణ పరిపాలన, లా అండ్ ఆర్డర్
పవన్ కల్యాణ్- పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా
నారా లోకేశ్- మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ (రియల్ టైమ్ గవర్నెన్స్)
వంగలపూడి అనిత- హోం శాఖ, విపత్తు నిర్వహణ
అచ్చెన్నాయుడు- వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖ, డెయిరీ, మత్స్యశాఖ
కొల్లు రవీంద్ర- ఎక్సైజ్, గనులు, జియాలజీ
నాదెండ్ల మనోహర్- ఆహార, పౌర సరఫరాలు
పొంగూరు నారాయణ- పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి
సత్యకుమార్ యాదవ్- వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖ
నిమ్మల రామానాయుడు- జల వనరుల అభివృద్ధి శాఖ
ఆనం రామనారాయణరెడ్డి- దేవాదాయ శాఖ
మహ్మద్ ఫరూఖ్- న్యాయ శాఖ, మైనారిటీ సంక్షేమం
పయ్యావుల కేశవ్- ఆర్థిక శాఖ, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాలు
అనగాని సత్యప్రసాద్- రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపులు
కొలుసు పార్థసారథి- గృహ నిర్మాణం, సమాచారం, ప్రజా సంబంధాల శాఖ
డోలా బాల వీరాంజనేయ స్వామి- సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాల శాఖ
గొట్టిపాటి రవికుమార్- విద్యుత్ శాఖ
కందుల దుర్గేశ్- టూరిజం, సాంస్కృతి శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ
గుమ్మిడి సంధ్యారాణి- మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం
బీసీ జనార్దన్ రెడ్డి- రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు
టీజీ భరత్- పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్
ఎస్.సవిత- బీసీ సంక్షేమం, ఆర్థికంగా బలహీనవర్గాల సంక్షేమం, చేనేత, టెక్స్ టైల్స్
వాసంశెట్టి సుభాష్- కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, ఆరోగ్య బీమా సేవలు
కొండపల్లి శ్రీనివాస్- సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్నారై సాధికారత మరియు సంబంధాలు
మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి- రవాణా, క్రీడలు, యువజన సర్వీసులు