ఆదివారం తెలుగు వారి నూతన సంవత్సరాది.. ఉగాది ని పురస్కరించుకుని.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు అధికారి కంగా పండుగను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి. ఏపీలో సీఎం చంద్రబాబు, తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి సహా.. ఆయా రాష్ట్రాల విపక్ష పార్టీల నాయకులు కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
అయితే.. పాలిటిక్స్ పరిస్థితి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో అచ్చంగా ఉగాది పచ్చడిని తలపిస్తోందని అంటున్నారు నెటిజన్లు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి మాదిరిగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాయకులు, రాజకీయాలు కూడా అలానే ఉన్నాయని అంటున్నారు.
తెలంగాణలో ప్రభుత్వం ఒక రూట్లో వెళ్తుంటే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు మరోరూట్లో వెళ్తున్నారు. పెట్టుబడులు.. వనరుల పెంపుపై సీఎం రేవంత్రెడ్డి దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. కానీ, నాయకులు.. మాత్రం ఆదాయార్జన వైపు ఎక్కువగా దృష్టి పెట్టారు. దీంతో అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించాలన్న రేవంత్రెడ్డి ఆశలు.. చప్పగా.. పుల్లగా.. వగరుగా మారుతున్నాయని నెటిజన్లు చెబుతున్నారు. ఇక, ప్రతిపక్ష బీఆర్ ఎస్ పరిస్థితి చేదుగా ఉందని అంటున్నారు. జంపింగ్ జిలానీల వ్యవహారం ఒకవైపు చర్చకు వస్తుంటే.. మరోవైపు పోయేవారు మళ్లీ ఎదురు చూపులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇక, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పరిస్థితి వగరుగా మారిపోయిందని అంటున్నారు. ఆయన పార్టీని ధూంధాంగా పైకి లేపుతానని అంటున్నా.. గ్రామీణ స్థాయిలో పట్టు కోల్పోయిన వైనంపై ఇప్పటికీ సమీక్షలు చేయలేదు. పైగా.. ప్రజాసమస్యలపై ప్రశ్నించేందు కు సభకు కూడా రావడం లేదు. ఎక్కడ ఎప్పుడు మైకు పట్టినా.. మనదే అధికారం అంటున్నారు తప్ప.. అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం గమనార్హం. అంతేకాదు.. పార్టీలో కమిటీలను ఏర్పాటు చేస్తానని చెప్పినా.. ఇప్పటికీ దిక్కుమొక్కు లేకుండా పోయింది. దీంతో ఆయన పరిస్థితి వగరును తలపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఏపీ విషయానికి వస్తే.. అధికార పార్టీ.. తీపి-పులుపు-కారం సమ్మేళనం అన్నట్టుగా.. సంపద సృష్టి-పెట్టుబడుల ఆహ్వానం-సంక్షేమం అమలు దిశగా అడుగులు వేస్తోంది. అయితే.. ఎక్కడా పూర్తిస్థాయిలో తీపి ఉండదు.. పులుపు ఉండదు.. కారమని కూడా అనిపించదు.. సో.. సర్కారు తీరు.. ఉగాది పచ్చడిని తలపిస్తోందని అంటున్నారు నెటిజన్లు. ఇక, వైసీపీ విషయానికి వస్తే.. రగ్గు కప్పుకొని మరీ నిద్రాణంలో ఉందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అంటే.. పులుపు-చేదు-తీపి ఎలాంటి రుచులు లేకుండా పోయాయని అంటున్నారు. మొత్తంగా పొలిటికల్ ఉగాది పచ్చడి చప్పగానే ఉందన్న కామెంట్లు వినిపిస్తుండడం గమనార్హం.