అటు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు.. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. పొలిటికల్ హీట్ అంతకంతకూ పెరిగిపోతోంది. అందుకు తగ్గట్లే వెండి తెరలను సైతం పొలిటికల్ టచ్ ఉన్న చిత్రాలతో వేడెక్కించే ప్రయత్నం జరుగుతోంది. అత్యంత శక్తిమంతమైన మాధ్యమం అయిన సినిమా ద్వారా జనాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. కానీ సినిమాలో చూపించేదంతా నమ్మి జనం ఒక పార్టీ పట్ల సానుకూల అభిప్రాయం ఏర్పరుచుకుంటారని.. ఓట్లు గుద్దేస్తారని అనుకుంటే అంతకంటే భ్రమ ఉండదని చెప్పడానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాలతో తీసే సినిమాలు లాభం చేకూరుస్తాయా.. నష్టం తెచ్చిపెడతాయా అన్న చర్చ నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల ముంగిట కొన్ని పొలిటికల్ సినిమాలు ప్రేక్షకుల మీదికి దండెత్తాయి. తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలంగా ‘యన్.టి.ఆర్’ సినిమాను తీయించింది. టాలీవుడ్లో చాలా మంచి పేరున్న క్రిష్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. నందమూరి బాలకృష్ణ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడమే కాక.. తన తండ్రి పాత్రను పోషించాడు. ఈ సినిమాకు రిలీజ్ ముంగిట మంచి హైప్ కనిపించింది. ఉన్నంతలో ఎన్టీఆర్ జీవితాన్ని అందంగా, ఆసక్తికరంగానే తెరపై ప్రెజెంట్ చేశాడు క్రిష్. బాలయ్య కూడా బాగా నటించాడు.
కానీ ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవం తప్పలేదు. ‘యన్.టి.ఆర్’ ఫస్ట్ పార్ట్ అయినా ఓ మోస్తరుగా ఆడిరది కానీ.. ఎన్నికల సమీపంలో విడుదలైన రెండో పార్ట్ అయితే పూర్తిగా తేలిపోయింది. అదే సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా వైసీపీ వాళ్లు ‘యాత్ర’ సినిమా తీయిస్తే ‘యన్.టి.ఆర్’తో పోలిస్తే దానికి మంచి ఫలితం దక్కింది. దానికి రిలీజ్ ముంగిట మరీ హైప్ ఏమీ లేదు. కానీ సినిమా ఉన్నంతలో బాగానే ఆడిరది. నిజానికి అందులో వైఎస్ వ్యక్తిత్వాన్ని మరీ ఎగ్జాజరేట్ చేశారు. అబద్ధాలు కూడా చూపించారు.
కానీ అప్పుడు జనాల మూడ్ వేరుగా ఉంది. వైసీపీకి మంచి ఊపు ఉన్న టైంలో,అలాగే టీడీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోయిన టైంలో రిలీజ్ కావడంతో ‘యాత్ర’కు జనాదరణ దక్కింది. ఆ వ్యతిరేకతను ‘యన్.టి.ఆర్’ సినిమా తగ్గించకపోగా ఇంకా పెంచిందనే చెప్పాలి. జనాలు తమ అసంతృప్తిని పరోక్షంగా ‘యన్.టి.ఆర్’ సినిమా రిజల్ట్‌తో చెప్పకనే చెప్పారు. అంతకంటే ముందు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడితో పాటు ఆయన తనయుడు నారా లోకేష్‌ను కించపరుస్తూ రామ్ గోపాల్ వర్మ తీసిన పక్కా ప్రాపగండా ఫిలిం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కూడా కొంత వరకు వైసీపీ కొంతమేర ప్రయోజనం పొందింది. ఐతే జనాల మూడ్‌ను బట్టి ఇలాంటి పొలిటికల్ సినిమాల ఫలితాలు ఉంటాయి తప్ప.. ఆ సినిమాలు వచ్చి జనాల ఆలోచనల్ని మార్చేస్తాయని చెప్పలేం.
ఇప్పుడు సీన్ రివర్స్
2019 ఎన్నికలకు ముందు నాటికి పూర్తి భిన్నమైన పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తున్నాయి. టీడీపీకి మంచి క్రేజ్ కనిపిస్తుండగా.. వైసీపీ మీద వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతోంది. కానీ ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా వైసీపీ మళ్లీ ‘సినిమా’ అస్త్రాన్ని బయటికి తీస్తోంది. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కథతో ‘యాత్ర’ తీసిన మహి.వి.రాఘవ్.. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ పాత్ర ఆధారంగా ‘యాత్ర-2’ తీయబోతున్నాడట. ఆ చిత్రాన్ని 2024 ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుకోబోతున్నారు.
కానీ వైఎస్ ఇమేజ్ వేరు. ఆయన ఒక వర్గం ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. ఆయన మరణం అందరినీ కలచివేసింది. ఆయన పాదయాత్ర కూడా ప్రత్యేకమైందే. పైగా ఆయన మరణానంతరం తీసిన సినిమా కావడంతో జనం దీనికి కనెక్ట్ అయ్యారు. పైగా వైసీపీకి ఊపు ఉన్న టైంలో రిలీజ్ కావడం ప్లస్ అయింది. కానీ జగన్‌కు వైఎస్ లాగా తటస్థుల్లో మంచి పేరు లేదు. పాలన చూస్తే దారుణంగా ఉంది. మెజారిటీ జనాలు ఆయన పేరెత్తితే మంటెత్తి పోతున్నారు. జగన్ పాదయాత్రలో చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలే ఇప్పుడు జనాల నోళ్లలో నానుతున్నాయి.
ఇలాంటి టైంలో జగన్‌ను గొప్పవాడిగా చూపిస్తూ పాదయాత్రకు ఎలివేషన్ ఇస్తే.. జనాలకు పుండు మీద కారం చల్లినట్లే ఉంటుంది. అన్నింటికీ మించి చనిపోయిన వ్యక్తుల మీద సానుకూల అభిప్రాయం ఉంటుంది. జగన్ కళ్ల ముందు ముఖ్యమంత్రిగా పెత్తనం చలాయిస్తుంటే.. మహా నేతలా కీర్తిస్తూ సినిమా తీస్తే జనాలకు మండిపోవడం ఖాయం. కాబట్టి ‘యాత్ర-2’ బూమరాంగ్ అయ్యే ప్రమాదమే ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు ఆర్జీవీ.. వ్యూహం అని, ఇంకొకటని ఏవో సినిమాలు తీస్తున్నాడట. జగన్‌కు ఎలివేషన్ ఇవ్వడం.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను కించపరచడమే ఆ సినిమాల ఉద్దేశంలా కనిపిస్తోంది.
కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి సినిమాలు తీస్తే అవి వైసీపీకి చేటు తప్ప పైసా ప్రయోజనం దక్కపోవచ్చు. పూర్తిగా క్రెడిబిలిటీ కోల్పోయి, వైసీపీ జీతగాడిగా మారిపోయి.. చిల్లర ట్వీట్లు, వీడియోలు చేస్తున్న ఆర్జీవీ సినిమా తీస్తే అసలు చూసేవాడెవడు అన్నది ప్రశ్న. వైసీపీ తెర వెనుక డబ్బులు పెట్టించి తీయిస్తున్న ఈ సినిమాలు రిలీజ్ అయి.. వాటికి నెగెటివ్ రిజల్ట్ వస్తే వైసీపీ మీద జనాల్లో వ్యతిరేకతకు అవి సంకేతాలుగా నిలవచ్చు. దాన్ని బట్టే ఎన్నికల్లో ఆ పార్టీ భవితవ్యం ఏంటో కూడా తేలిపోవచ్చు అని కూడా చర్చ జరుగుతోంది.
ఒక రకంగా టీడీపీ, జనసేన మద్దతుదారులు ఈ సినిమాలు తెరకెక్కాలని, విడుదల కావాలనే కోరుకుంటుండటం విశేషం. మరోవైపు టీడీపీ ఏమో 2019లో ‘యన్.టి.ఆర్’ సినిమా అనుభవంతో పనిగట్టుకుని సినిమాలేవీ తీయించే ప్రయత్నం చేయట్లేదు. పవన్‌కు కూడా అలాంటి ఉద్దేశాలేమీ లేవు. కానీ ‘వీరసింహారెడ్డి’లో ప్రభుత్వం మీద కౌంటర్లు వేస్తూ బాలయ్య పవర్ ఫుల్ డైలాగులు పేలిస్తే వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆయన తర్వాతి చిత్రాల్లోనూ ఈ ఒరవడి కొనసాగవచ్చు. పవన్ కూడా తన చిత్రాల్లో అలా పంచ్ డైలాగులు పేల్చే అవకాశాలున్నాయి.