వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనపై పోలీసు కేసు నమోదు అయింది. జూన్ 4న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సంగతి తెలిసిందే. అఫ్కోర్స్.. వైసీపీ అధికారం కోల్పోయి కూడా ఏడాదే అయింది. ఓవైపు టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు బుధవారం సంబరాలు చేసుకుంటంటే.. మరోవైపు వైసీపీ `వెన్నుపోటు దినం` అంటూ కూటమి ప్రభుత్వంపై తమ నిరశన తెలిపింది.
అయితే నిన్న గుంటూరులో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరగనున్న వెన్నుపోటు దినం కార్యక్రమానికి అంబటి తన ఇంటి నుంచి ర్యాలీగా బయలుదేరారు. అయితే పోలీసులు మార్గం మధ్యలోనే అంబటిని ఆపివేశారు. ర్యాలీకి అనుమతి లేదని తెలిపారు. దాంతో అంబటి రాంబాబు పోలీసులపైనే రుబాబు చూపించారు.
దమ్ముంటే ర్యాలీని ఆపండి.. మీ అంతు చూస్తామంటూ చిందులు తొక్కారు. తీవ్ర పదజాలంతో అంబటి విరుచుకుపడటంతో.. ఓ పోలీస్ అధికారి తీవ్రంగా స్పందించారు. అంబటి తీరుపై ఫైర్ అయ్యారు. దాంతో ఒకరినొకరు వేలు చూపించుకుంటూ నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఇక తాజాగా ఇదే వ్యవహారంలో అంబటిపై పట్టాభిపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. తమ విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ అంబటి రాంబాబుతో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై సెక్షన్ 353 కింద పోలీసులు కేసు ఫైల్ చేసి షాకిచ్చారు.