హైదరాబాద్ నుంచి ఏపీకి వెళుతున్న బస్సును రాష్ట్ర సరిహద్దు వద్ద ఆపేసి.. ప్రతి ఒక్కరి లగేజ్ ను తనిఖీ చేయటం ఇటీవల కాలంలో జరుగుతోంది. ఏపీతో పోలిస్తే.. తెలంగాణలో మద్యం చవకగా ఉండటంతో.. చాలామంది మద్యం బాటిళ్లను అక్రమంగా తీసుకెళ్లటం ఎక్కువైంది. అందుకే.. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సుల్ని తప్పనిసరిగా పోలీసులు తనిఖీలు చేస్తుంటారు. తాజాగా అలానే ఒక బస్సును ఆపి తనిఖీలు చేస్తున్నారు.
బస్సులోని వారు కొందరు నిద్రలో ఉంటే.. మరికొందరు మాత్రం తమ సెల్ ఫోన్లో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటివేళ.. 27 ఏళ్ల యువకుడు ఒకరు మాత్రం మస్తు టెన్షన్ గా కనిపించారు. అనుమానం వచ్చి అతడి బ్యాగ్ ను తనిఖీ చేసిన అధికారులు అవాక్కు అయ్యారు. ఎందుకంటే.. అందులోమద్యం బాటిళ్లు లేవు. అంతకు మించి అన్నట్లుగా వెండి కడ్డీలు పెద్ద ఎత్తున ఉన్నాయి.
వీటి విలువ రూ.10లక్షలకు పైనే ఉంటుందని తేల్చారు. నిందితుడిది కర్నూలు జిల్లా నంద్యాలగా గుర్తించారు. ఈ వెండి కడ్డీలకు సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవటంతో వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వ్యాపార పనిలో భాగంగానే ఈ వెండి కడ్డీలు తీసుకెళుతున్నట్లుగా నిందితుడు చెబుతున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.