పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడి దెబ్బకు పాక్ తో పాటు ఉగ్ర సంస్థల బాస్ లు కూడా ఖంగు తిన్నారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ఇంట్లోని 12 మందితో పాటు పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత సీజ్ ఫైర్ కు ఇరు దేశాలు అంగీకరించడంతో ఉద్రిక్త పరిస్థితి కాస్త చక్కబడింది. ఈ క్రమంలోనే ఆపరేషన్ సిందూర్ తర్వాత జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ తొలిసారిగా ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పహల్గంలో మతం అడిగి మరీ ఉగ్రవాదులు దాడి చేశారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఉగ్రదాడితో దేశమంతా నివ్వెరపోయిందని, ప్రతి భారతీయుడి హృదయం ప్రతీకార జ్వాలలతో రగిలిపోయిందని అన్నారు.
ప్రజలు, రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల వారు ఒక్కతాటిపైకి వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డారని కొనియాడారు. భారతీయ మహిళల నుదుటిపై సిందూరం తుడిచేసి వారికి బుద్ధి చెప్పేందుకు ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టామని అన్నారు.
ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత సైన్యం దాడి చేసిందని ప్రశంసించారు. మన నిఘా వర్గాల సామర్థ్యం, శాస్త్రసాంకేతిక సత్తా ఏంటనేది దేశం మొత్తానికి తెలిసిందని అన్నారు. ఇకపై, పాక్ తో చర్చలు అంటే పీవోకేను భారత్ లో విలీనం చేయడంపై, టెర్రరిజం అంతం చేయడంపై మాత్రమే ఉంటాయని మోదీ చెప్పారు. ఇకపై, భారత భూభాగంపై ఉగ్రదాడి జరిగితే దానిని యుద్ధంగా పరిగణిస్తామని మోదీ వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి తూటాకు మిస్సైల్ తో బదులిస్తామని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అంతం చేయకుంటే పాక్ అంతం అవుతుందని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ తో పాక్ వెన్నులో వణుకు పుట్టించామని, భారత్ ఎదురు దాడితో పాక్ కాళ్లబేరానికి వచ్చి కాల్పుల విరమణకు బ్రతిమిలాడిందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ కు తాత్కాలికంగా బ్రేక్ మాత్రమే ఇచ్చామని అన్నారు.