ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే..ఈ పేరు గురించి దేశంలో కొత్తగా ఎవరికీ పరిచయటం అవసరం లేదు. రాజకీయ వ్యూహకర్తగా దేశంలో ఈయన చాలా పాపులర్. అప్పుడెప్పుడో బీహార్లో నితీష్ కుమార్ కోసం పనిచేసి గెలుపులో భాగస్వామయ్యారు. తర్వాత నరేంద్రమోడి ప్రధానమంత్రి అవటంలో కూడా ఇదే పీకే 2014లో కీలక పాత్రే పోషించారు. తాజగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తరపున కూడా క్షేత్రస్ధాయిలో సర్వేలు చేసి గెలుపు కోసం సలహాలు, సూచనలు చేశారు.
ఇలాంటి పీకే ఇపుడు పశ్చిమబెంగాల్లో మమతబెనర్జీ తరపున పనిచేస్తున్నారు. మమత తరపున అంటేనే నరేంద్రమోడి, అమిత్ షాకు వ్యతిరేకంగా అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మమతను దెబ్బకొట్టి ఎలాగైనా బెంగాల్లో జెండా ఎగరేయాలని మోడి, అమిత్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఏవేవి చేయకూడదో అవన్నీ చేస్తున్నారు. ఇదే సందర్భంలో వీరిద్దరినీ ధీటుగా ఎదుర్కొనేందుకు మమత కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇలాంటి నేపధ్యంలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుసటి రోజే పీకే చేసిన ఓ ట్వీట్ సంచలనమైంది. 8 విడతలుగా జరిగే బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ స్కోర్ డబుల్ డిజిట్ దాటదంటు బల్లగుద్ది మరీ చెప్పారు. మార్చి 27న మొదలయ్యే మొదటివిడత ఎన్నిక ఏప్రిల్ 29న జరిగే ఎనిమిదవ విడత పోలింగ్ తో ముగుస్తుంది. మే 2వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. తాను చేసిన ట్వీట్ కు సమాధానం అందరికీ మే 2వ తేదీన దొరుకుతుందని పీకే ఘంటాపథంగా చెప్పటం ఆశ్చర్యంగా ఉంది.
గతంలో ఎప్పుడు కూడా పలానా పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని పీకే ఎప్పుడూ ప్రెడిక్షన్ ఇచ్చిన దాఖలా లేదు. మరలాంటిది ప్రత్యేకంగా బెంగల్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ స్కోర్ డబుల్ డిజిట్ దాటని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అయితే తృణమూల్ కాంగ్రెస్ కు ఎన్నిసీట్లు వస్తాయని మాత్రం చెప్పలేదు. బల్లగుద్ది చెప్పటం బాగానే ఉంది. తన జోస్యం ఏమాత్రం తప్పినా తర్వాత తన భవిష్యత్తేమిటో ఆలోచించుకుంటే బాగుంటుంది.