ఈవీఎం ధ్వంసం, పలువురిపై దాడి కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ నాలుగు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. అయితే, వాటిపై ఈ రోజు విచారణ జరిపిన హైకోర్టు తాజాగా పిన్నెల్లికి షాకిచ్చింది. ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో, పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేసి పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి నరసరావుపేట లేదా మాచర్ల కోర్టుకు తరలించే అవకాశముంది.
ఈ కేసులలో ఇప్పటి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్‌పై పిన్నెల్లి ఉన్నారు. అయితే, తాజాగా ఆ మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయడంతోపాటు నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్లనూ తిరస్కరించడంతో పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేశారు. పోలింగ్ రోజు పాల్వాయిగేటు పోలింగ్ బూత్‌లో ఈవీఎంను బద్దలు కొట్టడంతో పాటు అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ శేషగిరిరావుపై పిన్నెల్లి దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారని కేసులు నమోదయ్యాయి. ఆ ఘటనపై ప్రశ్నించిన ఓ మహిళను దుర్భాషలాడి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. ఇక, పోలింగ్ మరుసటిరోజు పిన్నెల్లి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి కారంపూడిలో అరాచకం సృష్టించి సీఐపై దాడి చేసి గాయపరిచారు. ఈ కేసుల్లో ఆయనను అరెస్టు చేశారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్లపై జూన్ 20న హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ రోజు తీర్పు వెలువడింది.
ఈ క్రమంలోనే పిన్నెల్లిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శలు గుప్పించారు. పిన్నెల్లి పిరికి సన్నాసి అని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇన్నాళ్లూ విర్ర వీగాడని, ఈ రోజు అరెస్టు చేసేందుకు వెళితే బాత్రూంలో దాక్కున్నాడని తెలిసిందని ఎద్దేవా చేశారు. పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి బాత్రూం నుంచి దూకి పారిపోయాడని విమర్శించారు. అతడిని కూడా అరెస్టు చేస్తారని, వదిలేది లేదని, ఈడ్చుకొచ్చి కటకటాల వెనక్కి పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. పిన్నెల్లి సోదరులు జీవితాంతం జైల్లోనే ఉంటారని జోస్యం చెప్పారు.