భారతీయ సినిమాకు ఊపిరి పోసిన దిగ్గజ నిర్మాత, దర్శకుడు దాదా సాహెబ్ ఫాల్కే జీవిత కథను సినిమాగా తీసుకురావడానికి ఇప్పుడు జోరుగా ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు రాజమౌళి సమర్పణలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘మేడిన్ ఇండియా’ పేరుతో ఒక సినిమా తెరపైకి వచ్చిన సమయంలోనే.. రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ లీడ్ రోల్‌లో మరో సినిమాను అధికారికంగా ప్రకటించారు.
ఒకే సమయంలో ఒక వ్యక్తి మీద రెండు సినిమాలు తెరకెక్కనున్నట్లు వార్తలు రావడం.. రెంటినీ ప్రతిష్టాత్మక వ్యక్తులే టేకప్ చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే ఆమిర్ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటిస్తే.. ఎన్టీఆర్ మూవీ అనధికారికంగా మాత్రమే వార్తల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫాల్కే కుటుంబ సభ్యులు ఆమిర్-హిరాని ప్రాజెక్టు వైపే నిలవడం గమనార్హం.
దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్‌పై ఆయన మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ ప్రాజెక్టు విషయంలో ఆమిర్-హిరాని టీం మూడేళ్ల నుంచి తనతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. రాజమౌళి కానీ, ఆయన టీం సభ్యులు కానీ ఇప్పటిదాకా తనతో మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘రాజమౌళి సమర్పణలో ఫాల్కే బయోపిక్ రాబోతున్నట్లు నేను కూడా వార్తలు చూశాను. కానీ ఆయన కానీ, తన టీం సభ్యులు కానీ నన్ను ఇప్పటిదాకా సంప్రదించలేదు. ఫాల్కేపై ఎవరైనా సినిమా తీయాలనుకుంటే ముందు కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. మా దగ్గరే రియల్ స్టోరీస్ ఉంటాయి.
ఆమిర్-హిరాని టీం మాతో ఎన్నోసార్లు చర్చలు జరిపింది. వాళ్ల అసిస్టెంట్ ప్రొడ్యూసర్ నాతో మూడేళ్లుగా టచ్‌లో ఉన్నారు. ఎన్నో వివరాలు తీసుకున్నారు. వాళ్లు నిజాయితీగా పని చేస్తున్నారు. వారిపై నాకు నమ్మకముంది. అందుకే బయోపిక్ విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆమిర్ ఖాన్ దాదాసాహెబ్ ఫాల్కేగా నటిస్తాడంటే నాకు చాలా ఆనందంగా ఉ:ది. ఆయన గొప్ప నటుడు, ఎంతో నిబద్ధతతో పని చేస్తారు ’’ అని చంద్రశేఖర్ శ్రీ కృష్ణ అన్నారు.