మొన్నటి వరకు కరోనా భయం. వ్యాక్సిన్ వచ్చేస్తే చాలు.. మహమ్మారికి చెక్ పెట్టినట్లే అన్న ధీమా. ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చేసింది. సైడ్ ఎఫెక్ట్స్ కు సంబంధించిన వార్తలు కొత్త టెన్షన్ కు కారణమవుతున్నాయి. అయితే..వ్యాక్సిన్ ఏదైనా.. వచ్చినంతనే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందనుకోవటం అత్యాశే అవుతుందని చెబుతున్నారు. ఒక వ్యాక్సిన్ ను రోజుకువేలాది మందికి వేస్తే.. అందులో వేళ్ల మీద లెక్క పెట్టేంత మంది విషయంలో కాస్త భిన్నమైన లక్షణాలు చోటు చేసుకోవటాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. అమెరికాలో కొద్ది రోజుల నుంచి కరోనా టీకాలు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. అక్కడక్కడా అలెర్జీ సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా అలాస్కా రాష్ట్రంలోని బార్ట్ లెట్ ప్రాంతీయ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఘటన కలకలాన్ని రేపుతోంది. కరోనా టీకా తీసుకున్న ఒక ఆరోగ్య కార్యకర్త తీవ్ర అలెర్జీకి గురయ్యారు. సదరు ఆరోగ్య కార్యకర్తకు గతంలోఎప్పుడూ ఎలాంటి అలర్జీలు తలెత్తలేదు.
అయితే.. టీకా ఇచ్చిన పది నిమిషాలకే ఆమె ఒంటి మీద పెద్ద ఎత్తున దద్దుర్లు వచ్చాయి. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది.. గుండె వేగంగా కొట్టుకోవటం లాంటి ఇబ్బందులు తలెత్తాయి. దీంతో.. ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మరో కార్యకర్తకు టీకా ఇచ్చిన తర్వాత కంటి కింద చర్మం ఉబ్బెత్తు కావటం.. కళ్లు తిరగటం.. గొంతులో అసౌకర్యం చోటు చేసుకున్నాయి. కొన్ని మందులు ఇచ్చిన తర్వాత అతనుకోలుకున్నాడు.
టీకా వేసిన తర్వాత అందరిలోకాకున్నా.. చాలా తక్కువ మందిలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వారికి వెంటనే వైద్య సేవల్ని అందిస్తున్నారు. వ్యాక్సిన్ ఇచ్చే కేంద్రాల్లో తప్పనిసరిగా ఆక్సిజన్.. అలర్జీ ఔషధాల్ని అందుబాటులో ఉన్న కేంద్రాల్లోనే సేవలు అందిస్తున్నారు. అయితే.. ఇలాంటి వాటి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది.