జగన్ పాలనలో టీడీపీ నేతలు కార్యకర్తలతో పాటు టిడిపి కార్యాలయాలపై కూడా దాడులు జరుగుతున్న వైనంపై సర్వత్రా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నివాసం మొదలు మారుమూల ప్రాంతంలోని టిడిపి కార్యాలయం వరకు దేనిపైనైనా దాడి చేసేందుకు వైసిపి శ్రేణులు వెనుకాడడం లేదని టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గ కేంద్రం మాచర్ల పట్టణంలో టిడిపి కార్యాలయం తగలబెట్టిన వైనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.
మాచర్ల నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటితోపాటు ఆ ప్రాంగణంలో ఉన్న టిడిపి కార్యాలయాన్ని కూడా వైసిపి శ్రేణులు తగలబెట్టడం కలకలం రేపింది. ఆ వ్యవహారం సద్దుమణగాక ముందే తాజాగా గుడివాడలో టిడిపి కార్యాలయంపై పెట్రోలు ప్యాకెట్లు విసిరి నిప్పంటించేందుకు వైసిపి శ్రేణులు ప్రయత్నించడం సంచలనం రేపుతుంది. ఈ క్రమంలోనే గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
గుడివాడలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు కర్రలు, కత్తులతో వీర విహారం చేస్తూ టిడిపి నేతలు, కార్యకర్తలు, స్థానికులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నాని ప్రధాన అనుచరుడు కాళీ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగినట్టుగా టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా టిడిపి నాయకులు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో టిడిపి గుడివాడ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు కాళీ ఫోన్ చేసి రంగా వర్ధంతి నిర్వహించవద్దని వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
ఆ విషయం చెప్పడానికి కాళీ ఎవరని రావి ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఎక్కువ మాట్లాడితే చంపేస్తానని కూడా కాళీ బెదిరించినట్టుగా రావి ఆరోపిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలోనే టిడిపి కార్యాలయం వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ దశలో టిడిపి ఆఫీసుపై పెట్రోల్ ప్యాకెట్లు విసిరి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేసి వైసీపీ నేతలను అక్కడి నుంచి పంపించేసి పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.