రాబోయే ఎన్నికలలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని పోటీ చేయరని, తన వారసుడిని రాజకీయాల్లోకి తెచ్చేందుకే పేర్ని నాని తప్పుకుంటున్నారని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు. బందరు సభలో నాని సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని మచిలీపట్నం సభలో పేర్ని నాని చెప్పడం సంచలనం రేపింది.
ఈ క్రమంలోనే సభ ముగిసిన తర్వాత పేర్ని నాని తన వ్యాఖ్యలపై క్లారిటీనిచ్చారు. తాను పోటీ చేయబోనన్న విషయం చాలా కాలంగానే చెబుతున్నానని అన్నారు. అయితే, జగన్ ను పేర్ని నాని వదలడని, బతికినంత కాలం తన కుటుంబం జగన్ వెన్నంటే ఉంటుందని నాని క్లారిటీ ఇచ్చారు. రాబోయే ఎన్నికలలో తన తనయుడు కిట్టు వైసీపీ అభ్యర్థిగా నిలబడుతున్నారని ప్రచారం జరుగుతుందని, కానీ ఆ విషయం చెప్పడానికి తాను ఎవరిని అని నాని అన్నారు.
టికెట్ ఎవరికి ఇవ్వాలి అనే విషయం పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇష్టం అని, జగన్ టికెట్ ఇస్తే కిట్టు పోటీ చేస్తానంటున్నాడు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒకవేళ జగన్ టికెట్ ఇవ్వకపోయినా తాను, కిట్టు, తన భార్య పార్టీ జెండా మోస్తూనే ఉంటామని చెప్పారు. జగన్ రాజకీయాల్లో ఉన్నంతకాలం తన కుటుంబం బతికున్నంత కాలం జగన్ వెంటే ఉంటామని అన్నారు. మరోసారి జగన్ తో బహిరంగ సభలో పాల్గొంటానో లేదో తెలియదని చెప్పారు.