మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ కు చెందిన గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం అయిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా జయసుధ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు జయసుధను పోలీసులు విచారణకు పిలిచారు. విచారణకు హాజరైన జయసుధపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.
తన న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరైన జయసుధపై రేషన్ బియ్యం గాయబ్ అంశంపై పలు ప్రశ్నలు కురిపించారట. గోడౌన్ లో బియ్యం బస్తాల సంఖ్య, రికార్డుల్లో ఉన్న సంఖ్య మ్యాచ్ కాలేదని, ఏం జరిగిందని ప్రశ్నించారట. దాదాపు 2గంటలపాటు జయసుధను విచారణ జరిపిన పోలీసులు అనంతరం వదిలివేశారు.
కాగా, వే బ్రిడ్జ్‌లో సమస్యల వల్ల ఈ తేడా వచ్చిందని పేర్ని నాని అంటున్నార. మాయమైన బస్తాల తాలూకు రూ.1.70 కోట్ల నగదును ప్రభుత్వానికి చెల్లించారు. ఆ చెల్లింపు తర్వాత జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తనిఖీ చేయడంతో గోడౌన్ లో మరిన్ని బస్తాలు మాయమయ్యాయని తెలిసిందట. దీంతో, పోలీసులు జయసుధకు నోటీసులిచ్చి విచారణకు పిలిపించారు. మరోవైపు, ఈ కేసులో పేర్ని నానిని కూడా ఏ6గా చేర్చారు. దాంతో, దానిని సవాల్ చేస్తూ నాని కోర్టును ఆశ్రయించారు. ఆ క్రమంలోనే తదుపరి ఆదేశాల వరకు నానిపై చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.