తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి ఎదిగిపోయిందని సంబరపడడం ఏమో కానీ.. మన సినిమాల ఓవరాల్ సక్సెస్ రేట్ దారుణంగా పడిపోతున్న మాట వాస్తవం. బడ్జెట్లు, పారితోషకాలు పెరిగిపోతున్నాయి కానీ.. సినిమాలకు వచ్చే వసూళ్లు తగ్గిపోతున్నాయి. కొత్త సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే జనాల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది. కాస్త పేరున్న సినిమాలకు కూడా ఓపెనింగ్స్ రావడం కష్టమవుతోంది. మంచి టాక్‌తో మొదలైన సినిమాలు కూడా వీకెండ్ తర్వాత కళ్లు తేలేస్తున్నాయి.
ఓటీటీల ప్రభావం సినిమాల మీద గట్టిగానే పడుతోందన్నది స్పష్టం. ఒకప్పుడు వేసవిలో పెద్ద సినిమాలు, హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడిన థియేటర్లు.. ఇప్పుడు సరైన సినిమాలు, కలెక్షన్లు లేక వెలవెలబోయాయి. ఈ విషయమై ఇండస్ట్రీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వేసవిలో విడుదలైన వాటిలో కొంచెం పేరున్న చిత్రం.. భైరవం. అలాంటి సినిమాలకు సరైన ఓపెనింగ్స్ రాకపోవడం చిత్ర బృందాన్ని నిరాశకు గురి చేసింది.
‘భైరవం’ అనుకున్నంత వసూళ్లు రాబట్టకపోవడానికి మహేష్ బాబు సినిమా ‘ఖలేజా’ రీ రిలీజ్ కారణమన్నది స్పష్టం. ఫస్ట్ రిలీజ్‌లో డిజాస్టర్ అయిన ఆ సినిమాకు ఇప్పుడు జనం బ్రహ్మరథం పడుతున్నారు. కొత్త సినిమాలన్నింటినీ పక్కకు నెట్టి ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. అర్లీ మార్నింగ్ షోలు, హౌస్ ఫుల్ బోర్డులతో ఈ సినిమా ఇండస్ట్రీకి పెద్ద షాకే ఇచ్చింది. కానీ దీని వల్ల కొత్త సినిమాల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. దీనిపై ఇప్పటికే ‘భైరవం’ ముఖ్య పాత్రధారల్లో ఒకరైన మంచు మనోజ్‌తో ఆ చిత్ర నిర్మాత కేకే రాధామోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.
రీ రిలీజ్‌లు శుక్రవారం కాకుండా వీక్ డేస్‌లో ఉండేలా చూసుకోవాలని అభిప్రాయపడ్డారు. దీనిపై ఇండస్ట్రీలో సీరియస్‌గా చర్చ జరగాల్సిన అవసరం కనిపిస్తోంది. ‘ఖలేజా’ అనే కాదు.. పలు రీ రిలీజ్‌లు కొత్త సినిమాలను దెబ్బ కొట్టాయి. పాత సినిమాలను సెలబ్రేట్ చేస్తున్న జనం.. కొత్త చిత్రాలను పట్టించుకోవడం లేదు. నిజానికి రీ రిలీజ్ సినిమాలను శుక్రవారమే విడుదల చేయాలనేమీ లేదు. అవి ఎప్పుడు వచ్చినా రెస్పాన్స్ ఇలాగే ఉంటుంది. అలాంటపుడు శుక్రవారం కొత్త చిత్రాలకు పోటీగా విడుదల చేయాల్సిన అసవరం లేదు. రాను రాను కొత్త చిత్రాల నిర్మాతలకు ఇదొక పెద్ద సమస్యలా మారిపోతుండడంతో దీనిపై ఇండస్ట్రీ ఒక నిర్ణయం తీసుకోక తప్పేలా లేదు.