ఏపీ లోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం నీటమునిగింది. నిజానికి ఒకప్పుడు భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలే జలమయం అయ్యేవి. కానీ.. ఇప్పుడు పట్టణప్రాంతాలు కూడా నీట మునుగుతున్నాయి. కాంక్రీట్ జంగిల్స్ పెరిగిపోవడం.. ఎక్కడికక్కడ ఆక్రమణలు కూడా పెరిగిపోయిన దరిమిలా.. నీరు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా పట్టణ ప్రాంతాలైన విశాఖ, విజయ వాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం ప్రాంతాలు గత రాత్రి నుంచి నీటిలో నానుతున్నా యి.
వాయుగుండం ప్రభావంతో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలే కాకుండా.. పట్టణ ప్రాంతాలు, పోలీసు స్టేషన్లు(గన్నవరం, తాడేపల్లి) నీటమునిగాయి. ప్రధాన రహదారుల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీనికితోడు డ్రైనేజీలు పొంగడంతో పలు దుకాణాల్లోకి వర్షపు నీరు చేరి వ్యాపారస్తులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకుని చిరు వ్యాపారులు తోపుడు బండ్లు వరద నీటికి కొట్టుకుపోయాయి.
రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి తీవ్రంగా ఉండడంతో సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన వర్షపు నీరు ను మోటర్ల ద్వారా తోడు వేసే కార్యక్రమాన్ని మున్సిపల్ సిబ్బంది ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. పారిశుధ్య కార్మికులు రహదారులపై చెత్త నిలువ లేకుండా వర్షం నీటికి కొట్టుకు వచ్చిన పేపర్లు కవర్లను తొలగించాలని సూచించారు. అయితే.. కాలువలను సైతం ఆక్రమించి చేసిన నిర్మాణాల కారణంగా.. నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్లో అమలు చేస్తున్న హైడ్రాను ఏపీలోనూ అమలు చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ప్రధాన పట్టణాలే వర్షాలకు మునిగిపోతుంటే.. ఎలా? అన్నది సాధారణ ప్రజల మాట. అందుకే సోషల్ మీడియాలో ఇప్పుడు హైడ్రా వంటి వ్యవస్థను ఏపీలోనూ తీసుకురావాలన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.