ఏపీ సీఎం జగన్ హయాంలో అప్పులు పెరిగిపోతున్నాయని, సంక్షేమ పథకాల అమలు పేరుతో రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఊబిలో నెడుతున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిగాక పన్నుల రూపంలో జగన్…జనం నడ్డి విరుస్తున్నారని విపక్ష నేతలు దుయ్యబడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులపై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలోని ఆర్ధిక శాఖ ఉన్నతాధికారుల పనితీరు దారుణంగా ఉందని పయ్యావుల విమర్శించారు. ఈ ప్రకారం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పయ్యావుల లేఖ రాశారు. ఏపీలో రూ. 40 వేల కోట్ల ఆర్దిక లావాదేవీలకు సంబంధించిన రికార్డుల నిర్వహణ సరిగా లేదని పయ్యావుల సంచలన ఆరోపణలు చేశారు. గత రెండేళ్లల్లో ఆర్ధిక శాఖలో జమా ఖర్చుల లెక్కలు అస్తవ్యస్తంగా ఉన్నాయని గవర్నరు దృష్టికి పయ్యావుల తీసుకెళ్లారు.
రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని, దీనిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని పయ్యావుల కోరారు. గత రెండేళ్ల ఆర్ధిక శాఖ రికార్డులను స్పెషల్ ఆడిటింగ్ చేయించాలని పయ్యావుల కోరారు. తన ఆరోపణలకు ఆధారంగా ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ కు కాగ్ రాసిన లేఖను గవర్నరుకు రాసిన లేఖతో పయ్యావుల జతపరిచారు. మరి, పయ్యావుల లేఖపై గవర్నర్ స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.