తొలి రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అమరావతి రాజధాని, మూడు రాజధానుపై చర్చ నేపథ్యంలో అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అమరావతి రాజధానికి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ జై కొట్టారని, కానీ సీఎం అయిన తర్వాత మాత్రం అమరావతిపై అక్కసు పెంచుకున్నారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు చెప్పినా సరే వైసీపీ సభ్యులు మాత్రం నమ్మడం లేదని టీడీపీ నేతలు విమర్శించారు.
ఈ క్రమంలోనే వైసీపీ నేతలపై పయ్యావుల కేశవ్ విమర్శలు గుప్పించారు. హైకోర్టులో వేసిన పిటిషన్ ను ప్రభుత్వం ఎందుకు ఉపసంహరించుకుందో చెప్పాలని పయ్యావుల సభలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పయ్యావుల, వైసీపీ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో పయ్యావుల కేశవ్ తనయుడు విక్రమ్ సింహాకు అమరావతిలో భూములున్నాయని బుగ్గన ఆరోపించారు. విక్రమ్ సింహాతో పాటుగా పలువురు టీడీపీ నేతలు కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లను చదివి వినిపించారు.
ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేయబోతున్నట్టు టీడీపీ నేతలకు చంద్రబాబు ముందే సమాచారం లీక్ చేశారన్న ఆరోపణలపై పయ్యావుల దీటుగా బదులిచ్చారు. అమరావతి రాజధానిపై చంద్రబాబు ప్రకటన తర్వాతే తన కుమారుడు అక్కడ భూములు కొన్నాడని పయ్యావుల క్లారిటీ ఇచ్చారు. అక్కడ తన కుమారుడు భూములు కొన్న మాట వాస్తవమేనని, కానీ, అధికారికంగా ప్రకటన జరిగిన తర్వాత అక్కడ భూములు కొంటే తప్పేంటి అని కూడా పయ్యావుల ప్రశ్నించారు.
ఇక అమరావతిలోని ఎస్సీ, ఎస్టీల భూములను టీడీపీ నేతలు లాక్కున్నారంటూ వస్తున్న ఆరోపణలను కూడా పయ్యావుల ఖండించారు. 2014కు ముందు ఎస్సీ, ఎస్టీల పేరుమీద ఉన్న భూములు వారి పేరిటే ఉన్నాయని, వాటిని ఎవరు కొనడానికి వీల్లేదని ఆనాటి టీడీపీ ప్రభుత్వం జీవో కూడా పాస్ చేసిందని పయ్యావుల వెల్లడించారు. బహుశా వైసీపీ నేతలు ఆ జీవో కాపీని చదివి ఉండరని, అందుకే స్పీకర్ కు ఆ కాపీని పంపిస్తున్నానని కూడా పయ్యావుల వైసీపీ సభ్యులకు చురకలాంటించారు. ఈ జీవోపేరు చెప్పగానే అప్పటిదాకా లేసిన వైసీపీ సభ్యుల నోళ్లు మూతబడ్డాయి.