జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాజా ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా ప్రస్తావించిన అంశాల్లో ఒకటి.. మహిళల అక్రమ రవాణా. రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు వైసీపీ పాలనలో అదృశ్యమయ్యారని.. వారి జాడ కూడా కనిపించడం లేదని.. జగన్ ప్రభుత్వం కనీసం వారిని గుర్తించే పని కూడ చేయలేదని విరుచుకుపడ్డారు. అయితే.. అప్పట్లో వీటిని.. ప్రభుత్వం తరఫున పలువురు నాయకులు ఖండించారు. ఏ ఆధారాలతో చెబుతున్నారని ప్రశ్నించారు.
మంత్రి బొత్స సత్యనారాయణ వంటివారు.. అసలు పవన్ చెప్పేవన్నీ పోసుకోలు కబుర్లేనని అన్నారు. ఇక, మాజీ మంత్రి పేర్ని నాని వంటి వారు.. పవన్ తెలిసీ తెలియకుండా ఏదో మాట్లాడతాడని.. అవన్నీ.. టీడీపీ రాసిచ్చిన స్క్రిప్టేనని వ్యాఖ్యానించారు. కానీ, ఇప్పుడు తాజాగా కొన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయి. కంబోడియా దేశంలోనే బానిసలుగా 5000 మంది ఏపీ వారు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇటీవల విశాఖలో వెలుగు చూసిన ఓ కేసును విచారించిన పోలీసులకు.. మానవ అక్రమరవాణా వ్యవహారం తాలూకు కూపీ దొరికింది.
దీనిని మరింత లోతుగా విచారించగా.. 58 మంది అపహరణకు గురైన వారిని పోలీసులు గుర్తించి.. వారి నుంచి వివరాలు సేకరించారు. మొత్తంగా కంబోడియా దేశానికే 5 వేల మందిని తరలించినట్టు గుర్తించారు. వీరిలో డిగ్రీ చదవిని యువతులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకెళ్ళిన కొందరు వ్యక్తులు అక్కడ చైనా గ్యాంగ్ లకు వారిని అమ్మేసినట్టు పోలీసులు తెలుసుకున్నారు. ప్రస్తుతం గుర్తించిన 58 మందిని విశాఖకు తీసుకొచ్చారు.
వీరిలో 40 మంది తెలుగు యవతులు ఉన్నట్టు పోలీసులు చెప్పారు. గాజువాకకు చెందిన చుట్టా రాజేష్.. ఉద్యోగాల ప్రకటనలో వల విసిరి వీరిని ఇతర దేశాలకు తరలించినట్టు గుర్తించారు. మిగిలిన వారి ఆచూకీ కోసం విదేశాలకు వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతిని తీసుకున్నట్టు తెలిపారు. బాధితులను సింగపూర్ మీదుగా కంబోడియాకు పంపించారని కమిషనర్ అయ్యన్నార్ వెల్లడించడం గమనార్హం. దీనిని బట్టి పక్కా సమాచారంతోనే పవన్ విషయాన్ని వెలుగులోకి తెచ్చారని.. ఇప్పుడు వైసీపీ నాయకులు ఏం చెబుతారని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు.