అటు తిరిగి ఇటు తిరిగి చివరకు తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ఫలితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ మెడకే చుట్టుకునేట్లుంది. పవన్ రావాలి..పవర్ స్టార్ వస్తారు.. రోడ్డుషోలు చేస్తారు. బహిరంగసభలో పాల్గొంటారు..బీజేపీ అభ్యర్ధిని అమాంతం గెలిపించేస్తారు. అనే డైలాగులు ఎక్కువగా కమలంపార్టీ నుండే వినిపిస్తున్నాయి.
అసలు సార్ ప్రచారానికి వస్తారో రారో కూడా ఇంతవరకు తేలలేదు. పవన్ లెఫ్టినెంట్ నాదెండ్ల మనోహర్ చెప్పేదాని ప్రకారం 3వ తేదీన రోడ్డుషోలో తర్వాత జరిగే బహిరంగసభలో పాల్గొంటారట.
బీజేపీ చీఫ్ సోమువీర్రాజుతో పాటు అభ్యర్ధి రత్నప్రభ కూడా పవన్ ప్రచారంలోకి ఈరోజు దూకుతారు, రేపు దూకుతారనే చెబుతున్నారు. ప్రచారానికి పవన్ వస్తారో లేదో తెలీదు కానీ పవన్ గనుక రంగంలోకి దిగితే గెలిచేది రత్నప్రభ మాత్రమే అన్నంతగా కమలనాదులు చాలా పెద్ద బిల్డప్పే ఇస్తున్నారు.
నిజానికి క్షేత్రస్ధాయిలో ఇపుడున్న పరిస్దితి ఏమిటంటే బీజేపీకి డిపాజిట్ దక్కేది కూడా అనుమానమే. మరిలాంటి పార్టీ తరపున ప్రచారానికి దిగి పవన్ చేయబోయేది ఏముంటుంది ? కచ్చితంగా రత్నప్రభను అయితే గెలిపించలేరు. బీజేపీ సొంతబలమేంటో అందరికీ తెలిసిందే కాబట్టి దానిగురించి చర్చ అవసరమే లేదు. మరిలాంటి నేపధ్యంలో రేపటి కమలంపార్టీ ఓటమి పవన్ మెడకే చుట్టుకుంటుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఎటూ ఓడిపోయే సీటే అయినా పవన్ మనసుపెట్టి ప్రచారం చేసుంటే తమ అభ్యర్ధి కచ్చితంగా గెలిచుండేదే అని బీజేపీ నేతలు వాదన మొదలుపెట్టే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. పవన్ గురించి ఇపుడు బీజేపీ నేతలు ఇంతగా ప్రకటనలు చేస్తున్నారంటే రేపటి తుఫానుకు నిదర్శనంగానే చెప్పుకుంటున్నారు.
బీజేపీ నేతలు ప్రత్యర్ధులపైనే కాదు అవసరమైతే మిత్రులపైన కూడా బ్లేమ్ గేమ్ ఆడటంలో సిద్ధహస్తులనే చెప్పాలి. మొత్తానికి వీరతాడ్లు కాదు ముందు బ్లేమ్ గేమ్ ను ఎదుర్కొనేందుకు పవన్ సిద్ధపడాలని జనసేనలోనే చర్చలు మొదలయ్యాయట.