మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్లుండి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. తాను రాజకీయాలకు దూరం అంటూ సినిమాలకే పరిమితం అయినా.. రాజకీయం ఆయన్ని వదలట్లేదు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన పార్టీకి మద్దతు ఇస్తూ ఇటీవలే రూ.5 కోట్ల విరాళం ప్రకటించిన ఆయన.. తాజాగా ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని ప్రజలకు పిలుపునిస్తూ ఒక వీడియో విడుదల చేయడం చర్చనీయాంశం అయింది.
ఈ వీడియోపై అధికార వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. చిరంజీవి ముసుగు తీసేశాడని.. వైసీపీకి వ్యతిరేకంగా ఓటేయాలని జనాలకు పిలుపునిస్తున్నాడని.. ఆయన మీద మండిపడుతున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల చిరుపై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలే చేశారు.
ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. చిరును టార్గెట్ చేస్తున్న వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. చిరంజీవి అజాత శత్రువు అని.. ఆయన ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చాడని ఆయన మీద వైసీపీ వాళ్లు అవాకులు చెవాకులు పేలుతున్నారని పవన్ అన్నాడు. చిరంజీవి గతంలో వైసీపీ ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతుగా నిలిచాడని, అప్పుడు వైసీపీ వాళ్లు ఆయన్ని కొనియాడారని.. కానీ ఇప్పుడు ఎన్టీయే కూటమికి మద్దతివ్వగానే ఆయన్ని తూలనాడుతున్నారని పవన్ వ్యాఖ్యానించాడు.
తన అన్నయ్యను ఏమైనా అంటూ తాను ఊరుకోనంటూ సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఎత్తి మరీ పవన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఏపీ సీఎం ఆ మధ్య టికెట్ల వ్యవహారం విషయంలో చిరు, ప్రభాస్, మహేష్ బాబు లాంటి వాళ్లతో వ్యవహరించిన తీరును పవన్ గుర్తు చేశాడు.
ఆ వ్యవహారంతో జగన్‌కు సంబంధం లేకున్నా జోక్యం చేసుకుని ఎంతో ఆదరణ ఉన్న హీరోలను తన దగ్గరికి రప్పించుకుని అవమానించారని.. వాళ్ల కార్లను గేట్ దగ్గరే ఆపి నడిపించారని.. కనీసం భోజనం కూడా పెట్టకుండా, గౌరవించకుండా పంపించారని.. జనం గుండెల్లో ఉన్న వాళ్లంటే జగన్ ఓర్వలేడని పవన్ అన్నాడు.