మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లెజెండరీ దర్శకుడు శంకర్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే విజయవాడలో 256 అడుగుల ఎత్తయిన రామ్ చరణ్ కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నిర్మాత, టీఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంత పెద్ద కటౌట్, ఆ కటౌట్ పై హెలికాప్టర్ పూలవర్షం కురిపించడం చూసి ఆశ్చర్యపోయిన దిల్ రాజు…చెర్రీ అభిమానులను అభినందించారు.
ఈ సందర్భంగా మెగా అభిమానులకు దిల్ రాజు కిక్కిచ్చే న్యూస్ ఒకటి చెప్పారు. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాబోతున్నారని దిల్ రాజు ప్రకటించారు. కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమం కోసం మాత్రమే తాను విజయవాడ రాలేదని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలవడానికి వచ్చానని చెప్పారు. కల్యాణ్ గారు ఇచ్చే డేట్ ను బట్టి గేమ్ చేంజర్ ఈవెంట్ ఎక్కడ, ఎప్పుడు అనేది ప్లాన్ చేస్తామన్నారు.
అమెరికాలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అని, అయితే, కల్యాణ్ గారు హాజరయ్యే ఈవెంట్ అంతకు మించి గ్రాండ్ గ్రాండ్ సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ ఈవెంట్ గురించి కల్యాణ్ గారితో మాట్లాడ్డానికి వచ్చానని దిల్ రాజు అన్నారు. ఆ ఈవెంట్ చరిత్ర క్రియేట్ చేయాలని దిల్ రాజు అభిమానులకు పిలుపునిచ్చారు. చాలాకాలం తర్వాత చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు, రామ్ చరణ్ ఒకే వేదికపైకి వచ్చే అవకాశముండడంతో మెగా అభిమానులు ఆ ఈవెంట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.