గుంటూరులో తొక్కిసలాట ఘటనపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ముగ్గురు మహిళలు మృతి చెందడంపై పవన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పేదలకు వస్త్రాలు పంపిణీ చేస్తున్న కార్యక్రమంలో తొక్కిసలాట జరగడం బాధాకరమన్నారు. జనతా వస్త్రాలు, కానుకల కోసం వచ్చిన ముగ్గురు పేద మహిళలు మృత్యువాతపడడం బాధ కలిగించిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని పవన్ ప్రార్థించారు.
మృతుల కుటుంబాలకు పవన్ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు, అయితే, కందుకూరు టిడిపి సభలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే గుంటూరులో తొక్కిసలాట జరగడం బాధాకరమని అన్నారు. ఈ తరహా కార్యక్రమాల విషయంలో నిర్వాహకులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, పోలీసు యంత్రాంగం కూడా తగిన భద్రతను కలిగించాలని పవన్ డిమాండ్ చేశారు.
మరోవైపు, కాపుల రిజర్వేషన్ల కోసం ఆమరణ నిరాహారదీక్షకు దిగిన మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరి రామ జోగయ్యను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించడంపై పవన్ స్పందించారు. హరిరామ జోగయ్య గారు చేస్తున్న ఆమరణ దీక్షపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని పవన్ డిమాండ్ చేశారు. 85 సంవత్సరాల వయసులో ఆయన దీక్ష చేపట్టడంతో ఆయన ఆరోగ్య విషయంలో ఆందోళన చెందుతున్నానని పవన్ అన్నారు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణం చర్చలు జరపాలని పవన్ డిమాండ్ చేశారు.