సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం.. పోలీసులు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ తెలిసిందే. ఈ ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం రేపేందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రేవంత్ రెడ్డి సర్కార్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను సీరియస్ గా తీసుకోవడంతో తెలుగు సినీ పరిశ్రమ ఇరకాటంలో పడింది. అదే సమయంలో ప్రభుత్వంపై కూడా కొంత వ్యతిరేకత ఏర్పడింది. ఇదిలా ఉంటే.. బన్నీ ఇషు పై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు.
సోమవారం మీడియాతో చిట్ చాట్ లో పవన్ మాట్లాడుతూ.. గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం నిజంగా బాధాకరం. ప్రత్యక్షంగా కారణం కాకపోయినా ఘటన జరిగిన వెంటనే హీరో లేదా దర్శక నిర్మాతను బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చి ఉండాల్సింది. అలా చేయకపోవడమే తప్పు. ఆ తప్పే ఇంత రచ్చకు దారితీసిందని పవన్ అభిప్రాయపడ్డారు.
బన్నీ వెళ్లడం కుదరకపోయినా మిగతా మూవీ టీం అయినా వాళ్ళ ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చుండాలి. అలా చేయకుండా హీరోని ఒంటరిని చేసి.. సమస్య మొత్తాన్ని అతనిపైనే వేశారని పవన్ అన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొంచెం సాప్ట్ గా వెళ్లుంటే బాగుండేదని పవన్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
అలాగే రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్ అని ఈ సందర్భంగా పవన్ కొనియాడారు. రేవంత్ రెడ్డి పేరును సరిగ్గా చెప్పలేదనే కారణంతోనే వాంటెడ్‌గా బన్నీని అరెస్ట్ చేశారనడం కరెక్ట్ కాదని.. ఆ స్థానంలో ఎవరున్నా చట్టాన్ని ఫాలో అవ్వాల్సిందే అన్నారు. ఈ ఇష్యూలో రేవంత్ రెడ్డిని తప్పుబట్టలేమన్నారు. సినిమా రంగాన్ని రేవంత్ బాగానే ప్రోత్సహించారని..బెనిఫిట్ షో అధిక ధరలకు అనుమతి ఇచ్చారని పవన్ గుర్తు చేశారు.