`పుష్ప 2` విడుదల సమయంలో చోటుచేసుకున్న సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన టాలీవుడ్ మొత్తాన్ని చిక్కుల్లో పడేసింది. అసెంబ్లీ వేదికగా ఈ ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ రోడ్ షో చేయడం వల్లే తొక్కిసలాట జరిగి రేవతి చనిపోయారని.. ఆమె కుమారుడికి బ్రెయిన్ డ్యామేజ్ అయిందని మండిపడ్డారు. అల్లు అర్జున్ కు కన్ను పోయిందా? కాలు పోయిందా? ఎందుకు అందరూ ఆయన్ను ఓదారుస్తున్నారు? రేవతి కుమారుడు ఆసుపత్రిలో ఇరవై రోజుల నుంచి కోమాలో ఉంటే ఇంత వరకు ఒక్క సినీ ప్రముఖులు కూడా పరామర్శించలేదంటూ రేవంత్ రెడ్డి విమర్శలు గప్పించారు.
అలాగే తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం సినిమాలకు బెనిఫిట్ షోలు వేసుకోవడానికి, టికెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతించబోనని అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు. ఈ నిర్ణయం టాలీవుడ్ కు పెద్ద సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్యాన్ ఇండియా సినిమాలకు నైజాం మార్కెట్లో భారీగా నష్టం వాటిల్లవచ్చు. అయితే ఇలాంటి పరిణామాల నడుమ టాలీవుడ్ సినీ పరిశ్రమ ఏపీకి రావాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
అధికారం చేపట్టింది మొదలు రాష్ట్రాభివృద్ధి, ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్.. తాజాగా ఏపీలోని అల్లూరి జిల్లా అనంతగిరి మండలం గిరిజన ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మీకోసం అహర్నిశలు ఎండనకా, వాననకా కష్టపడటానికి సంసిద్ధంగా ఉన్నాను. రోడ్లు, తాగు నీరు, యువతకి ఉపాధి అవకాశాలు.. ప్రధానంగా ఉన్న ఈ సమస్యలను పరిష్కించడానికి కృషి చేస్తాను అని గిరిజన ప్రజలందరికీ, మన్యం ప్రాంతం ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం తరఫున పవన్ మాటిచ్చారు.
ఇదే సమయంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఏపీకి తరలి రావాలని పవన్ కోరారు. ఏపీలో చాలా సుందరమైన ప్రదేశాలున్నాయని, సినిమా పరిశ్రమ ఇక్కడికి వచ్చి సినిమా షూటింగ్లు చేయాలని సూచించారు. విదేశాల్లో ఉండే అందమైన ప్రదేశాలు గిరిజన, పల్లె ప్రాంతాల్లోనూ ఉన్నాయని.. ఈ ఆహ్లాదకరమైన వాతావరణం సినీపరిశ్రమకు ఎంతో అనుకూలంగా ఉంటుందని పవన్ అన్నారు. ఇటువంటి చోట్ల షూటింగ్లు చేస్తే గిరిజనులకు ఉపాధి కూడా లభిస్తుందని పవన్ పేర్కొన్నారు.