‘మీరు కోరుకుంటే సీఎం అవుతా… లేదంటే కాలేను’ అని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రజలనుద్దేశించి అన్నారు.
సత్తెనపల్లి పర్యటనలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీకీ కొమ్ము కాయబోనని.. ఏ పార్టీకీ అమ్ముడుపోయే ఖర్మ తనకు లేదని అన్నారు.
తాను తప్పు చేస్తే ప్రజలు తనను చొక్కా పట్టుకుని నిలదీయాలన్నారు పవన్. తాను వారానికి ఓసారి ప్రజల్లోకి వస్తేనే తట్టుకుపోలేతున్నారని పవన్ అన్నారు.
తాను పట్టిన పట్టు విడవబోనని… పీకేస్తే మళ్లీ మొలుస్తానని, తొక్కేస్తే మళ్లీ లేస్తానని పవన్ అన్నారు.
ఏపీలో రౌడీయిజం పెరిగిపోతోందని.. వైసీపీ వాళ్లు నోరు పారేసుకుంటే తాను కూడా నోటితో సమాధానం చెప్తానని పవన్ అన్నారు.
వైసీపీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని… వారికి బుద్ధి చెప్తానని అన్నారు.
ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు తనకు తేడా ఉందని.. తనకు సినిమాలే ఆధారమని, ఆయనకు అలా కాదని పవన్ అన్నారు.
కాగా సత్తెనపల్లిలో నిర్వహించిన జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కల్యాణ్ 210 కౌలురైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు.
సుమారు 210 కుటుంబాలు సత్తెనపల్లి సభకు రాగా, ప్రతి కుటుంబానికి స్వయంగా పవన్ కళ్యాణ్ రూ. లక్ష చొప్పున చెక్కులు అందచేశారు.
కౌలు రైతుల కన్నీటి వెతలు తెలుసుకుంటూ.. కుటుంబ పెద్ద దూరమయ్యాక వారు పడిన ఇబ్బందులు అడిగి తెలుసుకుని ప్రతి కుటుంబాన్ని ఓదార్చారు.
భవిష్యత్తులో కూడా జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా నింపారు.